‘మోదీ, షాలను అరెస్ట్‌ చేయాలనుకున్నారు’

6 Jun, 2018 09:53 IST|Sakshi
నరేంద్ర మోదీ, అమిత్‌ షా (ఫైల్‌ ఫోటో)

అహ్మదాబాద్‌: సంచలనం సృష్టించిన ఇష్రాత్‌ జహాన్‌ బూటకపు ఎన్‌కౌంటర్‌ కేసులో సీబీఐ.. గుజరాత్‌ మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, అప్పటి గుజరాత్‌ హోంమంత్రి అమిత్‌ షాను అరెస్టు చేయాలనుకుందని మాజీ డీఐజీ వంజారా కోర్టుకి తెలిపారు. అదృష్టం బాగుండి వారిద్దరూ తప్పించుకున్నారని వ్యాఖ్యానించారు. ఇష్రాత్‌ జహాన్‌ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆయన సీబీఐ ప్రత్యేక స్థానంలో మంగళవారం విచారణకు హాజరయ్యారు. కాగా, సరైన ఆధారాలు చూపించడంలో సీబీఐ విఫలమైందంటూ 2014లో కోర్టు అమిత్‌ షా, మోదీలకు క్లీన్‌చిట్‌ ఇచ్చిన విషయం తెలిసిందే. 

విషయం.. అప్పటి గుజరాత్‌ ముఖ్యమంత్రి నరేంద్ర మోదీపై హత్యాయత్నానికి కుట్ర జరుగుతోందని పోలీసులకు సమాచారం అందింది. ఇష్రాత్‌ జహాన్‌, ఆమె స్నేహితులు జావేద్‌ అలియాస్‌ ప్రాణేశ్‌, పాకిస్తానీ యువకులు జీషాన్‌ జొహార్‌, అంజాద్‌ రాణాలను తీవ్రవాద దళంగా పోలీసులు అనుమానించారు. ఈ నలుగురు మోదీని హత్య చేయడానికి కుట్ర పన్నారని భావించి.. నాటి డీఐజీ వంజారా నేతృత్వంలో వారిని కాల్చి చంపారు. అయితే మృతులు తీవ్రవాదులు కాదనే విషయం సీబీఐ విచారణలో వెల్లడైంది. వంజారా కుట్ర పూరితంగా వ్యవహరించడం వల్లే నలుగురు అమాయకులు బలయ్యారని సీబీఐ కేసు నమోదు చేసింది. కాగా, కేసు నుంచి తమను విముక్తం చేయాలని వంజారా, మరో పోలీసు ఉన్నతాధికారి ఎన్‌.కే.అమిన్‌ వేసిన పిటిషన్‌లను సీబీఐ కోర్టు తిరస్కరించింది.

మరిన్ని వార్తలు