సీబీఎస్‌ఈ, ఐసీఎస్‌ఈ పరీక్షలు రద్దు

26 Jun, 2020 05:59 IST|Sakshi

సుప్రీంకు వెల్లడించిన కేంద్రం

న్యూఢిల్లీ: పెండింగ్‌లో ఉన్న సెంట్రల్‌ బోర్డు ఆఫ్‌ సెకండరీ ఎడ్యుకేషన్‌(సీబీఎస్‌ఈ) , ఇండియన్‌ సర్టిఫికెట్‌ ఆఫ్‌ సెకండరీ ఎడ్యుకేషన్‌( ఐసీఎస్‌ఈ) 10, 12 తరగతుల బోర్డు పరీక్షలను కోవిడ్‌ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం రద్దు చేసింది. ఈ పరీక్షలు గత షెడ్యూల్‌ప్రకారం జూలైలో జరగాల్సిఉంది. ఇంటర్నల్‌ పరీక్షల్లో విద్యార్థులు చూపించిన ప్రతిభ ఆధారంగా ఫైనల్‌ పరీక్షల్లో మార్కుల్ని నిర్ణయించి ఆగస్టులో ఫలితాలను ప్రకటిస్తారు. ఈ విషయాన్ని కేంద్రం గురువారం సుప్రీంకోర్టుకు తెలిపింది. అయితే సీబీఎస్‌ఈ పన్నెండో తరగతి విద్యార్థుల్లో ఆసక్తి కలిగిన వారికి ఫైనల్‌ ఇయర్‌ పరీక్షలు రాసుకునే అవకాశం కల్పిస్తారు. పరీక్ష రాస్తారా, లేదంటే గత మూడు పరీక్షల్లో చూపించిన ప్రతిభ ఆధారంగా వచ్చిన సర్టిఫికెట్‌తో ముందుకు వెళతారా అన్నది వారి ఇష్టానికే వదిలిపెట్టారు.

ఇలాంటి అవకాశం పదో తరగతి విద్యార్థులకులేదు. ఐసీఎస్‌ఈ 10, 12 తరగతి విద్యార్థులకు పరీక్ష రాసే అవకాశం ఇవ్వలేదు. ఈ విషయాన్ని జస్టిస్‌ ఏఎం ఖాన్‌విల్కర్, జస్టిస్‌ దినేశ్‌ మహేశ్వరి, జస్టిస్, సంజీవ్‌ఖన్నాల సుప్రీంకోర్టు బెంచ్‌కు కేంద్రం, సీబీఎస్‌ఈ తరఫున హాజరైన సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా తెలియజేశారు. జూలై 1–15 వరకు జరగాల్సిన మిగిలిన బోర్డు పరీక్షలన్నీ రద్దు చేసినట్టు సుప్రీంకు చెప్పారు. సీబీఎస్‌ఈ పన్నెండో తరగతి పరీక్షలు రాయాలని భావించే విద్యార్థు లకు కోవిడ్‌ పరిస్థితి అదుపులోకి వచ్చిన తర్వాత పరీక్షలు నిర్వహిస్తామన్నారు. సీబీఎస్‌ఈ, ఐసీఎస్‌ఈ పరీక్షల్ని నిర్వహించవద్దంటూ దాఖలైన పలు పిటిషన్లను సుప్రీం విచారణ చేపట్టిన సందర్భంగా కేంద్రం అత్యున్నత న్యాయస్థానానికి ఈ విషయాన్ని తెలిపింది.  

తాజా నోటిఫికేషన్‌ ఇవ్వండి : సుప్రీం
సీబీఎస్‌ఈ పన్నెండో తరగతి విద్యార్థులకు ఇచ్చిన పరీక్షల ఆప్షన్, గత పరీక్షల్లో చూపించిన ప్రతిభ ఆధారంగా మార్కులు ఏ విధంగా నిర్ణయిస్తారు ? , ఫలితాల తేదీ వంటివాటిపై కొత్తగా నోటిఫికేషన్‌ ఇవ్వాలని అత్యున్నత న్యాయస్థానం కేంద్రానికి, సీబీఎస్‌ఈ బోర్డుకి ఆదేశాలు జారీ చేసింది. కరోనా వైరస్‌ వ్యాప్తి ఒక్కో రాష్ట్రంలో ఒక్కోలా ఉండడం వల్ల పరీక్షల్ని ఎలా నిర్వహిస్తారో స్పష్టం చేస్తూ నోటిఫికేషన్‌ జారీ చేయాలని న్యాయమూర్తులు ఆదేశించారు. ఈ నోటిఫికేషన్‌ శుక్రవారం విడుదల చేస్తామని సొలిసిటర్‌ జనరల్‌ కోర్టుకు చెప్పడంతో విచారణను ఇవాళ్టికి వాయిదా వేశారు. 

మరిన్ని వార్తలు