జులై 15 కల్లా సీబీఎస్ఈ బోర్డు పరీక్ష ఫలితాలు

26 Jun, 2020 12:06 IST|Sakshi

ఢిల్లీ : కరోనా నేపథ్యంలో ప‌ది, 12వ త‌ర‌గ‌తుల‌కు చెందిన ప‌రీక్ష‌ల‌ను సీబీఎస్ఈ ర‌ద్దు చేసిన సంగతి తెలిసిందే. ఇంటర్నల్‌ అసెస్‌మెంట్‌ ద్వారా ఫ‌లితాల‌ను వెల్ల‌డిస్తామ‌ని సీబీఎస్‌ఈ పేర్కొన్నవిష‌యం తెలిసిందే. తాజాగా సీబీఎస్‌ఈ సమర్పించిన అసెస్‌మెంట్ మార్క్‌ల స్కీమ్‌కు శుక్రవారం సుప్రీంకోర్టు ఆమోదం తెలిపింది. ఇవాళ జ‌స్టిస్ ఏఎం ఖాన్‌విల్క‌ర్‌, దినేశ్ మ‌హేశ్వ‌రి, సంజివ్ ఖ‌న్నాల‌తో కూడిన త్రిస‌భ్య ధ‌ర్మాస‌నం ఈ కేసులో విచార‌ణ చేపట్టింది. సీబీఎస్ఈ కోర్టుకు స‌మ‌ర్పించిన అసెస్‌మెంట్ స్కీమ్‌ను అంగీక‌రించింది. పెండింగ్ ప‌రీక్ష‌లకు ఇంటర్నల్‌ అసెస్‌మెంట్‌ ద్వారా మార్క్‌లు వేసి ఈ ఏడాది జూలై 15వ తేదీలోగా తుది ఫ‌లితాల‌ను సీబీఎస్ఈ బోర్డు రిలీజ్ చేయ‌నున్న‌ది.  

ఇప్పటికే పూర్తయిన బోర్డు  పరీక్షల ఫలితాల ఆధారంగా తదుపరి  సబ్జెక్టులకు మార్కులను కేటాయించనుంది. కాగా ఏ పరీక్షలు రాయని విద్యార్థులకు మాత్రం అసెస్‌మెంట్‌, గత ఇంటర్నల్ పరీక్షలు, ప్రాజెక్టుల మూల్యాంకనం ద్వారా మార్కులను కేటాయించనున్నారు. మళ్లీ పరీక్షలు రాయాలనుకునే విద్యార్థులకు కూడా పరీక్షలు రాసే అవకాశాన్ని సీబీఎస్‌ఈ కల్పించింది. ఆప్షనల్‌ పరీక్షలు రాయాలా వద్దా అనేది విద్యార్థులకే వదిలివేసినట్లు సీబీఎస్‌ పేర్కొంది. ఒకవేళ పరిస్థితులు అనుకూలంగా ఉంటే పరీక్షలు రాయాలనుకుంటున్న విద్యార్థులకు సెప్టెంబర్‌లో నిర్వహించే అవకాశముందని సీబీఎస్‌ఈ తెలిపింది.
(సీబీఎ‍స్‌ఈ పరీక్షలు రద్దు)

సీబీఎస్‌ఈ 12వ తరగతి పరీక్షలు గత ఫిబ్రవరి 15న ప్రారంభం కాగా లాక్‌డౌన్‌ కారణంగా మధ్యలోనే ఆగిపోయాయి.  10వ తరగతి పరీక్షలు కూడా ఫిబ్రవరి 21 నుంచి మార్చి 29 వరకు నిర్వహించాల్సి ఉండగా సగంలోనే నిలిచిపోయాయి. దీంతో జూలైలో మిగిలిపోయిన పరీక్షలను నిర్వహించాలని సీబీఎస్‌ఈ భావించింది. కానీ ప్రస్తుత కరోనా దృష్యా అది సాధ్యం కాదని తెలిసి రద్దు చేయాలని నిర్ణయించింది. ఇంటర్నల్స్‌ ఆధారంగా  ఫలితాలు ప్రకటించేలా బోర్డులను ఆదేశించాలని పలువురు విద్యార్థుల తల్లిదండ్రులు సుప్రీంకోర్టులో పిటిషన్లు వేశారు. ఇదే అంశంపై వివిధ కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్న పిటిష‌న్ల‌ను సుప్రీం ధ‌ర్మాస‌నం ర‌ద్దు చేసింది. 

కాగా ఐసీఎస్ఈ బోర్డు త‌ర‌పున సుప్రీంలో న్యాయ‌వాది జ‌య‌దీప్ గుప్తా వాదించారు. అసెస్‌మెంట్‌ మార్కుల విధానం సీబీఎస్ఈతో పోలిస్తే ఐసీఎస్ఈలో తేడా ఉంటుంద‌ని, అయితే ప‌ద‌వ త‌ర‌గ‌తి విద్యార్థుల‌కు అన్నీ అనుకూలించిన‌ప్పుడు ప‌రీక్ష రాసే అవ‌కాశం క‌ల్పిస్తామ‌ని ఐసీఎస్ఈ న్యాయ‌వాది కోర్టుకు తెలియ‌జేశారు. కోర్టుకు సీబీఎస్ఈ స‌మ‌ర్పించిన అఫిడ‌విట్ త‌ర‌హాలోనే త‌మ‌ది కూడా ఉంద‌ని, కానీ స‌గ‌టు మార్కుల విధానం ఒక్క‌టే తేడా ఉంద‌ని జ‌య‌దీప్ తెలిపారు.

మరిన్ని వార్తలు