పది పాసవడం‌.. ఇక ఈజీ!

8 Oct, 2018 21:31 IST|Sakshi

ఉత్తీర్ణత శాతాన్ని పెంచేందుకు సీబీఎస్‌ఈ చర్యలు

పాస్‌ మార్కుల నిబంధనను సవరించే యోచన 

ఈ వారంలోనే నిర్ణయం.. త్వరలో అధికారిక ప్రకటన 

న్యూఢిల్లీ: సీబీఎస్‌ఈ పదోతరగతి చదివే విద్యార్థులకు శుభవార్త. ఇక మీరంతా పదోతరగతి పాస్‌ కావడం పెద్ద కష్టమేమీ కాదు. ఎందుకంటే పాస్‌ మార్కులకు సంబంధించిన నిబంధనలను సవరించి, ఉత్తీర్ణత శాతాన్ని పెంచేందుకు  సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ సెకండరీ ఎగ్జామినేషన్‌ (సీబీఎస్‌ఈ) త్వరలో పలు కీలక నిర్ణయాలు తీసుకోనుంది.  

మొత్తంగా 33 శాతం వస్తే చాలు.. 
ప్రస్తుతం సీబీఎస్‌ఈ విద్యావిధానంలో పదో తరగతిలో ఓ విద్యార్థి ఉత్తీర్ణుడు కావాలంటే ఇంటర్నల్స్‌లో 33 శాతం, థియరీ పరీక్షల్లో 33 శాతం మార్కులు సాధించాలనే నిబంధన ఉంది. అయితే ఈ నిబంధనను సవరించి, ఇంటర్నల్స్, థియరీలో కలిపి 33 శాతం మార్కులు వస్తే చాలు. అంటే థియరీలో 33 శాతంకంటే తక్కువగా వచ్చి, ఇంటర్నల్స్‌లో  33 శాతం కంటే ఎక్కువ వచ్చినా.. మొత్తంగా 33 శాతం దాటితే ఉత్తీర్ణులైనట్లే. రెండింటిలో 33 శాతం మార్కులు రావాలనే నిబంధన నుంచి మినహాయింపును ఇవ్వాలని సీబీఎస్‌ఈ యోచిస్తున్నట్లు సమాచారం.  

మీ అభిప్రాయమేంటో చెప్పండి.. 
ఇప్పటికే దీనికి సంబంధించిన సర్క్యూలర్‌ని అన్ని సీబీఎస్‌ఈ అనుబంధ పాఠశాలలకు బోర్డు జారీచేసింది. 33 శాతం నిబంధనను సవరించడంపై అభిప్రాయమేంటో చెప్పాలని ఆయా పాఠశాలలను సీబీఎస్‌ఈ కోరింది. వాటి నుంచి సమాధానం వచ్చిన వెంటనే ఈ వారంలోనే సమావేశమై, దీనిపై అధికారిక ప్రకటన జారీ చేయాలని భావిస్తోంది. 2011 నుంచి సీబీఎస్‌ఈ పదోతరగతి పరీక్షలను ఆప్షన్‌ 
(ఐచ్చికం)గా ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం మళ్లీ 7 ఏళ్ల తర్వాత పదో తరగతి పరీక్షలను కచ్చితం చేశాయి. దీంట్లో భాగంగానే పరీక్ష విధానాల్లో ఈ మార్పులు తీసుకురానున్నట్లు సమాచారం. 

ఫిబ్రవరి 19 నుంచి పరీక్షలు... 
వచ్చే ఏడాది ఫిబ్రవరి 19 నుంచి పరీక్షలు నిర్వహించాలని సీబీఎస్‌ఈ సూచనప్రాయంగా నిర్ణయించినట్లు సమాచారం. అందుకు సంబంధించిన కార్యాచరణను బోర్డు అధికారులు వేగవంతం చేశారు. 10, 12 తరగతుల పరీక్షలకు ముందు జరిగే ‘స్టూడెంట్‌ యాక్టివిటీస్‌’ను వీలైనంత త్వరగా అందజేయాలని ఆయా విద్యా సంస్థలు, పాఠశాలలకు సీబీఎస్‌ఈ అధికారులు లేఖలు పంపారు. దీన్ని బట్టి ఏటా జరిగే తేదీలకంటే ముందుగానే బోర్డు పరీక్షలు ఉండవచ్చని చెబుతున్నారు. ఇదిలాఉండగా.. సీబీఎస్‌ఈ గుర్తింపు పొందిన పాఠశాలల్లో చదివే 9, 10 తరగతుల విద్యార్థుల వివరాలు ఇవ్వాలని బోర్డు ఆదేశించింది. సెకండరీ, సీనియర్‌ సెకండరీ పరీక్షల నిర్వహణ నిమిత్తం ఆయా వివరాలను cbse.nic.inలో నమోదు చేయాలని సూచించింది. 

మరిన్ని వార్తలు