సీబీఎస్‌ఈ ఫలితాల్లో అమ్మాయిలే టాప్‌

3 May, 2019 03:24 IST|Sakshi
ఫలితాలు వెలువడ్డాక భోపాల్‌లో ఆనందంతో గంతులేస్తున్న సీబీఎస్‌ఈ 12వ తరగతి విద్యార్థినులు

విడుదలైన 12వ తరగతి ఫలితాలు

88.70 శాతం ఉత్తీర్ణత సాధించిన బాలికలు

న్యూఢిల్లీ: సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ సెకండరీ ఎడ్యుకేషన్‌ (సీబీఎస్‌ఈ) 12వ తరగతి ఫలితాల్లో బాలికలు దుమ్ములేపారు. బాలుర కంటే దాదాపు 9 శాతం ఎక్కువగా ఉత్తీర్ణత సాధించారు. అలాగే 500కు 499 మార్కులు సాధించి ఇద్దరు బాలికలు టాపర్లుగా నిలిచారు. గురువారం విడుదలైన ఈ ఫలితాల్లో బాలురు 79.40 శాతం ఉత్తీర్ణత సాధించగా.. బాలికలు 88.70 శాతం ఉత్తీర్ణత సాధించారు. మొత్తంగా ఈ పరీక్షల్లో 83.4 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు.

విద్యార్థుల ఫలితాలను సీబీఎస్‌ఈ తన వెబ్‌సైట్‌లో పొందుపరిచింది.  నగరాల వారీగా చూస్తే 98.20 ఉత్తీర్ణతా శాతంతో తిరువనంతపురం తొలి స్థానంలో నిలిచింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలు ఉన్న చెన్నై రీజియన్‌ 92.93 శాతం ఉత్తీర్ణతతో రెండో స్థానంలో నిలిచింది. 91.87 శాతంతో ఢిల్లీ మూడో స్థానం పొందింది.విదేశాల్లో 78 సెంటర్లలో సీబీఎస్‌ఈ పరీక్షలను నిర్వహించగా.. వీరిలో 95.43 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. ఈ ఏడాది ఫిబ్రవరి 16న నుంచి ప్రారంభమైన ఈ పరీక్షలకు దాదాపు 12.05 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు.

టాపర్లుగా నిలిచిన హన్సిక, కరిష్మా..
సీబీఎస్‌ఈ 12వ తరగతి ఫలితాల్లో ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌కు చెందిన హన్సికా శుక్లా, ముజాఫర్‌నగర్‌కు చెందిన కరిష్మా అరోరాలు 500కు 499 మార్కులు సాధించి టాపర్లుగా నిలిచారు. రిషీకేశ్‌కు చెందిన గౌరంగీ చావ్లా, రాయ్‌బరేలీకి చెందిన ఐశ్వర్య, జిండ్‌కు చెందిన భవ్య 500కి 498 మార్కులు సాధించి రెండో స్థానంలో నిలిచారు. 497 మార్కులతో మొత్తం 18 మంది విద్యార్థులు మూడో స్థానంలో నిలిచారు. పరీక్షల ముందు నుంచే తాను సోషల్‌ మీడియాకు దూరంగా ఉండి, విశ్రాంతి వేళ పాటలు విన్నానని హన్సిక చెప్పింది. రిలాక్స్‌ అయ్యేందుకు డ్యాన్స్‌ చేసేదానినని కరిష్మా చెప్పింది.  

కేజ్రీవాల్‌ కుమారుడికి 96.4 శాతం
సీబీఎస్‌ఈ 12వ తరగతి ఫలితాల్లో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ కొడుకు పుల్కిత్‌కు 96.4 శాతం మార్కులు వచ్చాయి. ఢిల్లీ డిప్యూటీ సీఎం  సిసోడియా పలువురు మంత్రులు పుల్కిత్‌కు అభినందనలు తెలిపారు.  

స్మృతీ ఇరానీ కుమారుడికి 91 శాతం
ఫలితాల్లో కేంద్రమంత్రి స్మృతీ ఇరానీ కొడుకు జోహర్‌కు 91 శాతం మార్కులు వచ్చాయి.  ‘వరల్డ్‌ కెంపో చాంపియన్‌షిప్‌లో కాంస్య పతకం గెలవడమే కాదు, జోహర్‌ 12వ తరగతిలో 91 శాతం మార్కులు సాధించాడు. యాహూ’ అని స్మృతి ట్వీట్‌ చేశారు.  

రీ వెరిఫికేషన్‌కు 8 వరకు అవకాశం
మార్కుల రీ వెరిఫికేషన్‌ కోసం మే 4 నుంచి 8 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. మార్కుల రీ వెరిఫికేషన్‌కు దరఖాస్తు రుసుము రూ.500. మూల్యాంకనం చేసిన జవాబు పత్రాల ఫొటో కాపీల కోసం విద్యార్థులు మే 20, 21 తేదీల్లో ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఒక్కో ఆన్షర్‌ బుక్‌కు రూ.700 చొప్పున రుసుము చెల్లించాలి. జవాబు పత్రాల రీ వ్యాల్యుయేషన్‌కు మే 24, 25 తేదీల్లో దరఖాస్తు చేయడానికి సీబీఎస్‌ఈ అవకాశం కల్పిస్తోంది. ఒక్కో ప్రశ్నకు రూ.100 చొప్పున రుసుము చెల్లించాల్సి ఉంటుంది.

మరిన్ని వార్తలు