ఆ రెండు పరీక్షలు మళ్లీ నిర్వహిస్తాం: సీబీఎస్‌ఈ

28 Mar, 2018 15:40 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, న్యూఢిల్లీ: పదో తరగతి గణితం‌, 12వ తరగతి ఆర్థికశాస్త్రం పరీక్షలను మళ్లీ నిర్వహించాలని సీబీఎస్‌ఈ నిర్ణయించింది. ఇటీవల జరిగిన పదో తరగతి మ్యాథమెటిక్స్, 12వ తరగతి ఎకనామిక్స్‌ పరీక్షల సందర్భంగా ప్రశ్నాపత్రాలు లీకైనట్టు వెలుగుచూడటం తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఈ పరీక్షల సందర్భంగా చోటుచేసుకున్న పరిణామాలు.. ప్రశ్నాపత్రాలు లీక్‌ కావడం వంటి విషయాలను దృష్టిలో పెట్టుకొని, మళ్లీ పరీక్ష నిర్వహించాలని నిర్ణయించామని, ఈ రెండు సబ్జెక్టులకు సంబంధించిన పరీక్షల తేదీని తమ వెబ్‌సైట్‌లో వెల్లడిస్తామని సీబీఎస్‌ఈ ఒక ప్రకటనలో తెలిపింది. విద్యార్థుల భవిష్యత్తు, పరీక్షలు పారదర్శకంగా ఉండాలన్న ఉద్దేశంతోనే ఈ రెండు పరీక్షలు మళ్లీ నిర్వహిస్తున్నట్టు ప్రకటించింది.

ఇటీవల నిర్వహించిన ఈ రెండు పరీక్షలకు దాదాపు 28లక్షలమంది విద్యార్థులు హాజరయ్యారు. సీబీఎస్‌ఈ నిర్ణయంతో పదో తరగతిలో 16,38,428 మంది విద్యార్థులు, 12వ తరగతిలో 11,86,306మంది విద్యార్థులు మరోసారి పరీక్షలకు హాజరుకావాల్సి ఉంటుంది. టెన్త్‌ మ్యాథమెటిక్స్‌ ప్రశ్నాపత్రం చాలా సులువుగా రావడం, 12వ తరగతి ఎకనామిక్స్‌ ప్రశ్నాపత్రం లీకై.. వాట్సాప్‌లో చక్కర్లు కొట్టడం పరీక్షల సందర్భంగా దుమారం రేపిన సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు