...అందుకే ఫీజు పెంచాం

14 Aug, 2019 08:34 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

న్యూఢిల్లీ: భారీ స్థాయిలో పెంచిన 10, 12 తరగతుల బోర్డు పరీక్షల ఫీజుపై సీబీఎస్‌ఈ వివరణ ఇచ్చింది. రూ. 200 కోట్ల ఆర్థిక లోటు వల్లే ఫీజులు పెంచాల్సి వచ్చిందని బోర్డు కార్యదర్శి అనురాగ్‌ త్రిపాఠీ మంగళవారం తెలిపారు. 10, 12 తరగతుల పరీక్షా నిర్వహణకు దాదాపు రూ. 500 కోట్ల ఖర్చు అవుతోందని అన్నారు. ఇప్పటి వరకూ నీట్, జేఈఈ వంటి పరీక్షల నిర్వహణ ద్వారా ఆర్థిక వెసులుబాటు ఉండేదన్నారు. ఇప్పుడు అవి మానవ వనరులు, అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలోని నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ కిందకు వెళ్లిపోయాయన్నారు. దీంతో తప్పనిసరై పరీక్ష ఫీజులను పెంచాల్సి వచ్చిందన్నారు. ఇప్పటికే బోర్డు రూ. 200 కోట్ల లోటుతో నడుస్తోందన్నారు.

అయితే ఢిల్లీలో షెడ్యూల్డ్‌ కులాలు, షెడ్యూల్డ్‌ తెగల విద్యార్థులు పెంచిన ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. వారు రూ.50 కడితే సరిపోతుందని తెలిపారు. షెడ్యూల్డ్‌ కులాలు, షెడ్యూల్డ్‌ తెగల విద్యార్థులపై భారం పడకుండా పెంచిన ఫీజు మొత్తాన్ని చెల్లించేందుకు ఢిల్లీ ప్రభుత్వం అంగీకరించిందని వెల్లడించారు. కేజ్రీవాల్‌ సర్కారు నిర్ణయంతో పేద విద్యార్థులకు ఊరట లభించింది. (చదవండి: సీబీఎస్‌ఈ ఫీజు 24 రెట్లు పెంపు)

మరిన్ని వార్తలు