జయ వార్డులో సీసీ కెమెరాలు ఆపేశాం

23 Mar, 2018 01:39 IST|Sakshi
జయలలిత

అపోలో అధినేత ప్రతాప్‌ సి. రెడ్డి వెల్లడి

టీ.నగర్‌ (చెన్నై): దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత అనారోగ్యంతో చికిత్స పొందిన సమయంలో.. ఒక ఐసీయూ యూని ట్‌ మొత్తాన్ని ఆమెకే కేటాయించామని, ముందు జాగ్రత్తగా ఆమె వార్డులోని సీసీ కెమెరాలను ఆపేశామని అపోలో హాస్పిటల్స్‌ గ్రూప్‌ ఎగ్జిక్యూటివ్‌ చైర్మన్‌ ప్రతాప్‌ సి. రెడ్డి వెల్లడించారు. సంబంధం లేని వ్యక్తులు చూడకూడదనే ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. అపోలో ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ కొలొరెక్టల్‌ సర్జరీ, యూఎస్‌ఏ క్లీవ్‌ల్యాండ్‌ క్లినిక్, యూనివర్సిటీ కాలేజ్‌ ఆఫ్‌ లండన్‌ సంయుక్త ఆధ్వర్యంలో ఈ నెల 24, 25న నిర్వహించనున్న సదస్సు గురించి మీడియాతో మాట్లాడుతూ.. జయకు అందించిన చికిత్స వివరాల్ని వెల్లడించారు.

‘24 గదుల ఐసీయూ యూనిట్‌ మొత్తాన్ని జయకే కేటాయించినా.. ఒక గదిని మాత్రమే ఉపయోగించాం. చికిత్స పొందిన 75 రోజులు అన్ని సీసీటీవీల్ని ఆపుచేశాం. మిగతా రోగుల్ని వేరే ఐసీయూలోకి మార్చాం’ అని చెప్పారు. కొద్దికాలం సన్నిహిత బంధువులు తప్ప ఎవరినీ ఐసీయూలోకి అనుమతించలేదని, ఆమె పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నప్పుడు డ్యూటీలో ఉన్న వైద్యుడి సమ్మతి మేరకే అనుమతించేవారిమని తెలిపారు. జయలలితకు ఆస్పత్రిలో అత్యుత్తమ వైద్య చికిత్స అందించామని, విదేశీ వైద్యులు కూడా సాయపడ్డారని, ఆమె పూర్తిగా కోలుకున్నారని భావించిన తరుణంలో తీవ్ర గుండెపోటు రావడంతో ఎంత ప్రయత్నించినా కాపాడలేకపోయామన్నారు.

మరిన్ని వార్తలు