ఖతర్నాక్ చోరీ.. క్యాష్ కౌంటర్ ఖాళీ

25 May, 2016 09:54 IST|Sakshi
ఖతర్నాక్ చోరీ.. క్యాష్ కౌంటర్ ఖాళీ

ముంబై: ఇద్దరు పిల్లలను వెంటబెట్టుకుని ముగ్గురు మహిళలు హోటల్ కు వచ్చారు. కాపాలదారుల కన్నుగప్పి క్యాష్ కౌంటర్ నుంచి నగదు నొక్కేసారు. అక్కడున్న వారిని బురిడీ కొట్టించినా కెమెరాకు చిక్కి పోలీసులకు దొరికిపోయారు. నవీముంబైలో గతవారం ఈ ఘటన చోటుచేసుకుంది. ఇద్దరు బాలికలను తీసుకుని ముగ్గురు మహిళలు వచ్చారు.

క్యాష్ కౌంటర్ వద్ద నిలబడి హోటల్ వారితో మాట్లాడుతున్నట్టు నటిస్తూ నీలం రంగు దుప్పటాలను అడ్డుగా ఉంచారు. క్యాష్ కౌంటర్ కనబడకుండా కవర్ చేశారు. వారి వెనుక ఉన్న చిన్నపాప క్యాష్ కౌంటర్ నుంచి డబ్బు దొంగిలించింది. లాక్ వేసివున్నా తాళం వెతికి మరీ నగదు కాజేసింది. వారు వెళ్లిపోయిన తర్వాత దొంగతనం జరిగినట్టు గుర్తించిన నిర్వాహకులు సీసీ టీవీ ఫుటేజీ పరిశీలించగా అందులోని దృశ్యాలు చూసి అవాక్కయ్యారు. చిన్నపాప దొంగతనం చేయడం చూసి కంగుతిన్నారు.

రూ. 20,500 చోరీకి గురైనట్టు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశామని హోటల్ మేనేజర్ ప్రియాంక తెలిపారు. ఇదే తరహాలో నవీ ముంబైలో నాలుగు దుకాణాల్లో చోరీలు జరిగినట్టు సీసీ కెమెరాల్లో రికార్డైంది. దీని ఆధారంగా సివారి రైల్వేస్టేషన్ బయట ఇద్దరు మహిళలను పోలీసులు అరెస్ట్ చేశారు. మరొకామె పరారీలో ఉంది. ఇద్దరు బాలికలను అదుపులోకి తీసుకుని జువనైల్ హోమ్ కు తరలించారు.

>
మరిన్ని వార్తలు