..ఆ ఇద్దరిలో ఎవరు అధికారిక అభ్యర్ధి ?

15 Sep, 2018 00:23 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

ఎన్నికల నియమాలపై మధ్యప్రదేశ్‌ అధికారులకు పరీక్ష పెట్టిన సీఈసీ

58 శాతం పైగా ఫెయిల్‌.. ప్రాథమిక పరిజ్ఞానం నిల్‌

ఓ రాజకీయ పార్టీ తరఫున ఇద్దరు అభ్యర్థులు నామినేషన్లు వేసినట్టయితే, వారిలో ఎవరు అధికారిక అభ్యర్ధి అవుతారు?
అభ్యర్ధులు సెక్యూరిటీ డిపాజిట్‌ను ఎప్పుడు కోల్పోతారు? ఓ వ్యక్తి తనకు కింది కోర్టు మూడేళ్లు జైలుశిక్ష విధించిన పక్షంలో –  హైకోర్టు నుంచి బెయిల్‌ తెచ్చుకుని ఎన్నికల్లో పోటీ చేసేందుకు అర్హత పొందగలరా?

మధ్యప్రదేశ్‌ శాసనసభ ఎన్నికల్లో రిటర్నింగ్‌ / అసిస్టెంట్‌  రిటర్నింగ్‌ ఆఫీసర్లుగా విధులు నిర్వర్తించాల్సిన అధికారులపై కేంద్ర ఎన్నికల సంఘం ఇలాంటి ప్రశ్నలు సంధించింది. ఆగస్టులో వారికి పరీక్ష పెట్టింది. అదనపు జిల్లా మేజిస్ట్రేట్లు, సబ్‌ డివిజనల్‌ మేజిస్ట్రేట్లు, రెవెన్యూ ఆఫీసర్లు గంటసేపు నిర్వహించిన ఈ పరీక్షకు హాజరయ్యారు. సగానికి పైగా అధికారులు పై ప్రశ్నలకు సమాధానాలు రాయలేక తెల్లమొహం వేశారట! మొత్తం 58 శాతం మందికి పైగా తప్పారట!!

వీరంతా ఈ ఏడాది జరగనున్న రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో  కీలక విధులు నిర్వర్తించాల్సిన వాళ్లు. ఎన్నికల విధుల్లో వున్న ప్రతి అధికారికి నియమ నిబంధనలు తప్పక తెలిసి వుండాలనే ఉద్దేశంతోనే ఈ పరీక్ష నిర్వహించామంటున్నారు మధ్యప్రదేశ్‌ ప్రధాన ఎన్నికల అధికారి వీఎల్‌ కాంతారావు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం –  వెయ్యి మందికి పైగా అధికారులు ఎన్నికల బాధ్యతల్లోకి దిగాల్సివుంది.  వీరిలో 567 మంది అధికారులు పరీక్ష రాయగా, 244 మంది మాత్రమే ఉత్తీర్ణులయ్యారు. పరీక్ష రాసిన వారికి ఎన్నికల నిర్వహణపై నాలుగు రోజుల శిక్షణ ఇచ్చారు. విషయాలను బాగా తలకెక్కించేందుకు కొంత సమాచారం కూడా అందించారు.

70 శాతం పైబడి మార్కులొచ్చిన వారిని మాత్రమే ఎన్నికల విధులు నిర్వర్తించేందుకు అర్హులుగా ప్రకటించారు. తప్పిన అధికారులు మరోసారి పరీక్ష రాయాల్సిందే. ప్రస్తుతం శిక్షణ తీసుకుంటున్న బ్యాచ్‌తో కలిపి, వారికి మరోసారి పరీక్ష పెడతామని చెబుతున్నారు కాంతారావు. రెండోసారి కూడా తప్పిన వారిపై చర్యలు తీసుకోవాల్సిందిగా ప్రధాన ఎన్నికల కార్యాలయం ప్రభుత్వానికి లేఖ రాస్తుందని తెలిపారు.
పరీక్షకు హాజరైన పలువురు అధికారులు ఏ మాత్రమూ సంతోషంగా లేరట. రెవెన్యూ వసూళ్ల సంగతి చూసుకోవాలి.  శాంతి భద్రతలు చక్కదిద్దుకోవాలి. పనిభారంతో సతమతమైపోతున్నాం. పరీక్ష పెట్టే బదులు మాకో గైడు ఇవ్వొచ్చు కదా.. దాని సాయంతో శుభ్రంగా ఎన్నికల డ్యూటీ పూర్తి చేసేస్తాం కదా.. అంటున్నారు ఓ రెవెన్యూ అధికారి.

ఒక గంట సమయమివ్వాల్సి వుండగా, అరగంటలోనే  పరీక్ష ముగించేశారని ఆరోపిస్తున్నారు పరీక్ష తప్పిన మరో అధికారి.
పోలింగ్‌ నిర్వహణ తాలూకూ ప్రాథమిక పరిజ్ఞానం లేనివాళ్లు  ఎన్నికలు సజావుగా జరపగలరని ఎలా విశ్వసించగలమని ప్రశ్నిస్తున్నారు సమాచార హక్కు కార్యకర్త అజయ్‌ దూబే. ప్రజాస్వామ్యంలో పారదర్శకత తప్పనిసరి కాబట్టి, పరీక్షా పత్రాలను బహిరంగపరచాలని ఆయన ఈసీని డిమాండ్‌ చేస్తున్నారు. ఇంతకీ అధికారులను అవస్థల పాల్జేసిన పై ప్రశ్నలకు సమాధానాలేంటి?

పార్టీ నుంచి నామినేషన్‌ లెటర్‌ (బిఫామ్‌) పొందిన వ్యక్తే అధికారిక అభ్యర్ధి.
పోలైన మొత్తం ఓట్లలో ఆరింట ఒక వంతు ఓట్లు పొందలేని అభ్యర్ధులు సెక్యూరిటీ డిపాజిట్‌ కోల్పోతారు.
ఒక వ్యక్తి దిగువ కోర్టు తనకు విధించిన శిక్షపై హైకోర్టు స్టే ఇస్తే – ఎన్నికల్లో పోటీ చేయొచ్చు.

మరిన్ని వార్తలు