అసెంబ్లీ ఎన్నికలపై రంగంలోకి సీఈసీ

7 Sep, 2018 01:39 IST|Sakshi

నేడు రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారులతో భేటీ 

రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులపై చర్చ.. 

ఆ నాలుగు రాష్ట్రాల ఎన్నికలతో పాటే తెలంగాణలోనూ!

సాక్షి, న్యూఢిల్లీ : రాష్ట్రంలో అసెంబ్లీ రద్దయిన నేపథ్యంలో ఎన్నికల నిర్వహణపై కేంద్ర ఎన్నికల సంఘం దృష్టి సారించింది. రాష్ట్రంలోని పరిస్థితులు, అసెంబ్లీ ఎన్నికల సన్నద్ధతపై శుక్రవారం సమావేశం నిర్వహించనుంది. అధికార వర్గాల సమాచారం మేరకు.. ప్రధాన ఎన్నికల కమిషనర్‌ (సీఈసీ) ఓపీ రావత్, మరో ఇద్దరు సభ్యులు అశోక్‌ లావాసా, సునీల్‌ అరోరాలు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రజత్‌కుమార్‌తో పాటు రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ సీనియర్‌ అధికారులతో భేటీ కానున్నారు. తెలంగాణలో ఓటర్ల జాబితా, భద్రతా సిబ్బంది, పోలింగ్‌ సిబ్బంది, పోలింగ్‌ బూత్‌ల ఏర్పాటు, ఈవీఎంలు తదితర అంశాలపై వీరు చర్చించనున్నారు.

ఇక్కడ నెలకొన్న పరిస్థితులు, శాంతి భద్రతల అంశాలను పరిగణనలోకి తీసుకుని ఎన్నికల నిర్వహణపై నిర్ణయం తీసుకోనున్నారు. రాష్ట్రంలోని పరిస్థితులపై కేంద్ర ఎన్నికల సంఘం సంతృప్తి చెందితే సోమ లేదా మంగళవారం రోజున తెలంగాణకు కేంద్ర బృందాల్ని పంపి ఇక్కడి అధికారులతో సమావేశాలు నిర్వహించనుంది. ఇదిలావుండగా మధ్యప్రదేశ్, రాజస్తాన్, ఛత్తీస్‌గఢ్, మిజోరం రాష్ట్రాల అసెంబ్లీలకు నవంబర్‌ రెండో వారంలో గడువు ముగుస్తున్న నేపథ్యంలో అక్టోబర్‌ రెండో వారంలో ఎన్నికల నోటిఫికేషన్‌ ప్రకటించాలని కమిషన్‌ భావిస్తోంది. కుదిరితే ఈ నాలుగు రాష్ట్రాలతో పాటే తెలంగాణలోనూ ఒకటి లేదా రెండు విడతల్లో ఎన్నికలు నిర్వహించే అవకాశముందని అధికార వర్గాలు తెలిపాయి. మరోవైపు ఎన్నికల నిర్వహణపై ఈ రాష్ట్రాల్లో ప్రధాన పార్టీల అభ్యంతరాలు, అభిప్రాయాలను కేంద్ర ఎన్నికల సంఘం తెలుసుకోనుంది.  
 

మరిన్ని వార్తలు