లేదంటే 2019 మార్చిలోగా నిర్వహిస్తాం

8 Sep, 2018 01:43 IST|Sakshi

‘సాక్షి’ ఇంటర్వ్యూలో కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్‌ ఓపీ రావత్‌

సంసిద్ధతకు సమయం అవసరమైతే కొత్త జాబితా ప్రాతిపదిక

మార్చి 5లోగా కొత్త అసెంబ్లీ సమావేశమవ్వాలి

ఏడు విలీన మండలాలపై హోంశాఖ నోటిఫికేషన్‌ ఆధారంగా నిర్ణయం

నన్ను సీఎస్, మాజీ సీఎస్‌ కలిశారు

రాజకీయ పార్టీలు ఎన్నికల షెడ్యూల్‌పై మాట్లాడటం సరికాదు

సాక్షి, ఢిల్లీ ప్రతినిధి: తెలంగాణ శాసనసభ మార్చి 5లోగా సమావేశమయ్యేందుకు వీలుగా అసెంబ్లీ ఎన్నికలు నిర్వహిస్తామని కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. అయితే నాలుగు రాష్ట్రాల ఎన్నికలతోపాటు తెలంగాణకూ ఎన్నికలు నిర్వహించడంపై సంసిద్ధత స్థాయినిబట్టి నిర్ణయం తీసుకుంటామని కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్‌ ఓం ప్రకాష్‌ రావత్‌ ‘సాక్షి’కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వూ్యలో వెల్లడించారు. సంసిద్ధతకు సమయం అవసరమనుకుంటే 2019 జనవరి 1 ప్రాతిపదికన రూపొందించే ఓటరు జాబితా ఆధారంగా జనవరి నుంచి మార్చిలోగా ఎన్నికలు నిర్వహిస్తామని ఆయన స్పష్టం చేశారు. సంసిద్ధతస్థాయి సంతృప్తికరంగా ఉంటే 2018 జనవరి 1 ప్రాతిపదికన రూపొందించిన ఓటరు జాబితా ఆధారంగా ఎన్నికలు నిర్వహిస్తామన్నారు. 2018 జనవరి 1 నాటికి 18 ఏళ్లు నిండి ఓటరుగా నమోదు చేసుకోని వారి కోసం ప్రత్యేకంగా స్వల్పకాలంలో ఓటరు నమోదు ప్రక్రియ పూర్తి చేస్తామని వివరించారు. వీటి ఆధారంగా డిసెంబర్‌లోపే ఎన్నికలు నిర్వహిస్తామని తెలిపారు. ఏడు మండలాల విలీనం అంశంపై కేంద్ర హోంశాఖ ఇచ్చే నోటిఫికేషన్‌ ఆధారంగా తమ నిర్ణయం ఉంటుందన్నారు. ఇంటర్వూ్య ముఖ్యాంశాలు...

సాక్షి: తెలంగాణ అసెంబ్లీ రద్దయింది. మరి ఎన్నికల నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం ఏ మేరకు సంసిద్ధంగా ఉంది?
సీఈసీ: తెలంగాణ అసెంబ్లీ రద్దయినట్లు నిన్న నోటిఫికేషన్‌ వెలువడిందని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి నుంచి మాకు సమాచారం వచ్చింది. ఈ నేపథ్యంలో మేం తెలంగాణలో ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర స్థాయిలో, జిల్లా స్థాయిల్లో సంసిద్ధత స్థాయిపై సీఈవోను నివేదిక కోరాం. నివేదిక రాగానే మూల్యాంకనం చేయడంతోపాటు క్షేత్రస్థాయిలో పరిస్థితిని పరిశీలించి బేరీజు వేస్తాం. ఆ తరువాతే తెలంగాణలో ఎన్నికల నిర్వహణపై షెడ్యూల్‌ జారీ చేస్తాం.

సాక్షి: ఎప్పటిలోగా ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది? కాలపరిమితి ఏమైనా ఉందా?
సీఈసీ: దీనిపై సుప్రీంకోర్టు రూలింగ్‌ ఉంది. అసెంబ్లీ కాలపరిమితికన్నా ముందే రద్దయినప్పుడు సాధ్యమైనంత త్వరగా ఎన్నికలు నిర్వహించాలని, అందుబాటులో ఉన్న తొలి అవకాశాన్ని వినియోగించుకోవాలని, ఆరు నెలలకు మించకుండా ఎన్నికలు నిర్వహించాలని సుప్రీంకోర్టు చెప్పింది. అందువల్ల మార్చి 5లోగా తెలంగాణ అసెంబ్లీ సమావేశమవ్వాలి.

సాక్షి: త్వరలో జరగనున్న నాలుగు రాష్ట్రాల ఎన్నికలతోపాటు తెలంగాణకు ఎన్నికల నిర్వహణ సాధ్యమేనా?
సీఈసీ: అది ఇప్పుడే చెప్పలేం. ఎందుకంటే రాజస్తాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, మిజోరం రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు జూలైలోనే సంసిద్ధత కసరత్తు మొదలైంది. అందువల్ల తెలంగాణలో సంసిద్ధత స్థాయిని మేం మూల్యాంకనం చేయాల్సి ఉంది. అప్పుడే మేం ఒక నిర్ణయానికి రాగలం.

సాక్షి: సంసిద్ధతకు ఈ సమయం సరిపోదా?
సీఈసీ: దాని కోసమే ఈ మూల్యాంకనం. సంసిద్ధతకు మూడు నెలలు అవసరం అవుతుందా లేక ఒక నెలా అన్నది చూడాలి.

సాక్షి: మీరు 2018 జనవరి 1 జాబితాతో ఎన్నికలకు వెళ్తారా లేక స్పెషల్‌ రివిజన్‌ చేపడతారా?  
సీఈసీ: ఒకవేళ సంసిద్ధతకు చాలా సమయం పడుతుందని భావిస్తే సమ్మరీ రివిజన్‌–2019 కొనసాగుతుంది. ఆ ఓటరు జాబితాల ఆధారంగా 2019లో ఎన్నికలు నిర్వహిస్తాం. కానీ ఒకవేళ మేం ఎన్నికల సంసిద్ధత స్థాయిపై సంతృప్తి చెందితే 2018 జనవరి 1 సమ్మరీ రివిజన్‌ ఆధారంగా ముందుకెళ్తాం. ఆ తేదీ నాటికి ఓటు హక్కు కలిగి ఓటరుగా నమోదు చేసుకోని వారికి మరో అవకాశం కల్పిస్తూ స్వల్పకాల ప్రత్యేక రివిజన్‌ చేపడతాం. ఆ వెంటనే షెడ్యూల్‌ విడుదల చేస్తాం.

సాక్షి: ఈసారి వీవీ ప్యాట్‌లు అందుబాటులో ఉంటాయా?
సీఈసీ: వందకు వందశాతం అందుబాటులో ఉంచుతామని ఇదివరకే అఖిలపక్ష సమావేశంలో చెప్పాం. దాన్ని అమలు చేస్తాం. మరికొన్ని రోజుల్లోనే వీవీ ప్యాట్‌లను తెలంగాణకు అందుబాటులోకి తెస్తాం. ఆ యంత్రాల ఉత్పత్తి కొనసాగుతోంది.

సాక్షి: తెలంగాణ నుంచి ఏడు మండలాలను ఏపీలో విలీనం చేశారు. అక్కడి ఓటర్ల పరిస్థితి ఏమిటి? వారు ఎటువైపు ఓటు వినియోగించుకోవాల్సి ఉంటుంది?
సీఈసీ: మేం దానిపై సమాచారం అడిగాం. ఆరు నెలలుగా హోంశాఖ వద్ద అది పెండింగ్‌లో ఉంది. కొన్ని రోజుల్లోనే ఆ సమస్య పరిష్కారమవుతుందనుకుంటున్నాం. హోంశాఖ ఇచ్చే నోటిఫికేషన్‌ ఆధారంగా ఓటరు జాబితా సవరించాల్సి ఉంటుంది.

సాక్షి: ఈ ఏడు మండలాలను ఏపీలో కలపడం వల్ల తెలంగాణలోని మూడు నియోజకవర్గాల ఎస్టీ రిజర్వేషన్‌లో మార్పు ఉంటుందా?
సీఈసీ: ఆ అంశాలన్నింటినీ కేంద్ర హోంశాఖ విడుదల చేసే నోటిఫికేషన్‌ ఆధారంగా నిర్ణయిస్తాం.

సాక్షి: రాజకీయ పార్టీలకు ఈ సమయంలో మీరిచ్చే సూచన ఏమిటి?
సీఈసీ: ఏ అభిప్రాయమైనా చెప్పే ముందు అన్ని వాస్తవాలను పరిగణనలోకి తీసుకోవాలని పార్టీలకు నా విజ్ఞప్తి.

సాక్షి: తెలంగాణలో ప్రస్తుతం ఎన్నికలను స్వేచ్ఛగా, నిష్పాక్షికంగా జరిపే పరిస్థితి ఉందా?
సీఈసీ: అందుకు కమిషన్‌ అన్ని విధాలుగా వనరులను సమకూర్చుకుంటుంది.

సాక్షి: ఇప్పటివరకు సంసిద్ధత స్థాయిపై అంచనాకు వచ్చారా?
సీఈసీ: తెలంగాణలో ఎన్నికల సంసిద్ధతపై ఇప్పటివరకు మా వద్ద ఉన్న సమాచారాన్ని నేటి సమావేశంలో మూల్యాంకనం చేస్తున్నాం. సోమవారం రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి మాతో సమావేశమవుతారు. ఆ తరువాత కేంద్ర ఎన్నికల సంఘం నుంచి ఒక బృందం మంగళవారం తెలంగాణలో పర్యటించి సంసిద్ధతను ధ్రువీకరించుకుంటుంది.

సాక్షి: షెడ్యూల్‌ విడుదలకు ఏయే అంశాలను పరిగణనలోకి తీసుకుంటారు?
సీఈసీ: ఓటరు జాబితాలు, పోలింగ్‌ కేంద్రాలు, అర్హతగల వారందరికీ ఓటు హక్కు కల్పించడం, ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ యంత్రాలు, వీవీ ప్యాట్‌లు సమకూర్చుకోవడం, వాహనాలు, సిబ్బంది, సాయుధ బలగాలు... ఇలా అన్నింటినీ పరిగణనలోకి తీసుకోవాలి. అలాగే అసెంబ్లీ రద్దయినప్పుడు ఎన్నికల కమిషన్‌ సాధ్యమైనంత త్వరగా, ఆరు నెలలకు మించకుండా ఎన్నికలు నిర్వహించాలని సుప్రీంకోర్టు గతంలో చెప్పింది. అలాగే సంసిద్ధత, ఇతర కారణాలు చెప్పి ఎన్నికల నిర్వహణను జాప్యం చేసి ఆపద్ధర్మ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకునేందుకు అవకాశం కల్పించరాదని కూడా చెప్పింది. ఇవన్నీ బేరీజు వేసుకుని షెడ్యూల్‌ జారీ చేస్తాం. మార్చి 5 వరకు మాకు గడువు ఉంది. అందువల్ల అవసరమనుకుంటే కొంత సమయం తీసుకుంటాం. సంసిద్ధతస్థాయి బాగుంటే నాలుగు రాష్ట్రాల ఎన్నికలకంటే ముందు కూడా జరగొచ్చు.

సాక్షి: అక్టోబర్, నవంబర్‌లలో ఎన్నికల నిర్వహణ ఉంటుందని, తాను సీఈసీతో మాట్లాడానని సీఎం ప్రకటించారు. రాజకీయ పార్టీలు దీన్ని తప్పుబడుతున్నాయి. దీనిపై మీరేమంటారు? ముఖ్యమంత్రి మీతో మాట్లాడారా?
సీఈసీ: ఏ రాజకీయ పార్టీ అయినా ఎన్నికల కమిషన్‌ పరిధిలోకి చొచ్చుకురావడం తప్పు. షెడ్యూల్‌ నిర్ణయించడం, జారీ చేయడం అనే ప్రత్యేక అధికారం కేవలం ఎన్నికల కమిషన్‌కు మాత్రమే ఉంది. రాజకీయపక్షాలే కాదు.. మేం కూడా అదే అభిప్రాయంతో ఉన్నాం. ఈ తరహా వ్యాఖ్యలు సరికాదు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌.కె. జోషి, ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ మమ్మల్ని కలిశారు. ఊహాజనిత ప్రశ్న అడిగారు. కమిషన్‌ ఊహాజనిత ప్రశ్నలపై కామెంట్‌ చేయదని చెప్పాం.

మరిన్ని వార్తలు