‘జమిలి’కి చాన్సే లేదు: సీఈసీ రావత్‌

24 Aug, 2018 04:29 IST|Sakshi
ప్రధాన ఎన్నికల కమిషనర్‌ ఓపీ రావత్‌

ఔరంగాబాద్‌: దేశంలో జమిలి ఎన్నికలు జరిగే అవకాశమే లేదని ప్రధాన ఎన్నికల కమిషనర్‌ ఓపీ రావత్‌ స్పష్టం చేశారు. ఒకేసారి ఎన్నికలు నిర్వహించేందుకు ముందుగా న్యాయపరమైన ప్రక్రియ చేపట్టాల్సి ఉంటుందన్నారు. అందుకే పార్లమెంటు, అన్ని రాష్ట్రాల అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించటం సాధ్యం కాదన్నారు. మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ.. ఈ విషయాన్ని వెల్లడించారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల కోసం ఓటరు ధ్రువీకరణ పత్రాలు (వీవీపీఏటీ) యంత్రాలు 100% సిద్ధంగా ఉన్నాయన్నారు. 2019 ఎన్నికల కోసం 17.5 లక్షల వీవీపీఏటీలు ఆర్డర్‌ ఇవ్వగా.. ఇందులో 10 లక్షల యంత్రాలు వచ్చేశాయన్నారు. మిగిలినవి కూడా త్వరలోనే వస్తాయని ఆయన వెల్లడించారు. సహజంగానే సార్వత్రిక ఎన్నికలకు 14 నెలల ముందునుంచే ఎన్నికల సంఘం సిద్ధమవుతుందని ఈసారి కూడా 2018 ఫిబ్రవరి నుంచే ఏర్పాట్లు చేసుకుంటున్నామని ఆయన చెప్పారు. 

మరిన్ని వార్తలు