జగన్నాథుడి రథయాత్ర ప్రారంభం

4 Jul, 2019 10:29 IST|Sakshi

పూరి : జగన్నాథుని రథయాత్ర అంగరంగ వైభవంగా గురువారం ఉదయం ప్రారంభమైంది. ఉదయం తొమ్మిది గంటలకు  ప్రాతఃకాల ధూపదీపాదులు, మంగళ హారతి ముగించి మూల విరాట్ల తరలింపు (పొహొండి) కార్యక్రమం చేపట్టారు. శ్రీ మందిరం నుంచి స్వామి యాత్ర కోసం ఉవ్విళ్లూరుతున్న రథాలు ఉరకలేసుకుని ముందస్తుగా శ్రీ మందిరం సింహద్వారం ఆవరణకు చేరాయి. రథ నిర్మాణ ప్రాంగణంలో తయారీ ముగించుకుని వస్త్రాలంకరణ, కలశ స్థాపన, చిత్ర లేఖనం వగైరా ఆర్భాటాలతో మూడు రథాలు ఒక దాని వెంబడి మరొకటిగా క్రమంలో స్వామికి స్వాగతం పలికేందుకు ముందస్తుగా సింహదార్వం దగ్గర నిరీక్షించాయి.

సుదర్శనుడు, బలభద్రుడు, దేవీ సుభద్ర, జగన్నాథుని మూల విరాట్లు వరుస క్రమంలో రథాలపైకి చేరిన తర్వాత రథయాత్ర ప్రారంభమైంది. ఈ యాత్ర సూర్యాస్తమయం వరకు నిరవధికంగా కొనసాగుతుంది. మరోవైపు  జగన్నాథుని రథయాత్రను పురస్కరించుకుని ప్రధాన దేవస్థానం శ్రీ మందిరం పుష్పాలంకరణతో శోభిల్లుతోంది. ఆలయ చరిత్రలో రథయాత్రను పురస్కరించుకుని దేవస్థానం పుష్పాలంకరణతో శోభిల్లడం ఇదే తొలిసారి. యాత్ర నేపథ్యంలో శ్రీ మందిరం, గుండిచా మందిరాలు, ఉప ఆలయాల్ని పూలతో అలంకరిస్తారు.
 
సీసీ టీవీ నిఘా
స్వామి రథయాత్రను పురస్కరించుకుని అశేష జన వాహిని తరలి వస్తుంది. రోడ్డు, రైలు రవాణా సంస్థలు యాత్రికుల తరలింపు కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశాయి. యాత్రికుల రద్దీ దృష్ట్యా శాంతిభద్రతల నిర్వహణకు ప్రత్యేక ప్రాధాన్యం కల్పించారు. పూరీ పట్టణం అంతటా పకడ్బందీగా సీసీటీవీ కెమెరా నిఘా కార్యాచరణలో ఉంటుందని రాష్ట్ర డైరెక్టరు జనరల్‌ ఆఫ్‌ పోలీసు డాక్టర్‌ రాజేంద్ర ప్రసాద్‌ శర్మ తెలిపారు. రైలు, బస్సులు ఇతరేతర వాహనాలు, సముద్ర మార్గం గుండా చొరబాటుదారుల నివారణకు గట్టి నిఘా ఏర్పాటు చేశారు. రైల్వే ప్లాట్‌ఫామ్‌పై జాగిలాల స్క్వాడ్‌తో బాంబు నిర్వీర్య దళాల్ని రంగంలోకి దింపారు. నలు వైపుల నుంచి తరలి వచ్చే వాహనాలతో అవాంఛనీయ ట్రాఫిక్‌ సమస్యలు తలెత్తకుండా ప్రత్యేక నియంత్రణ ఏర్పాటుచేశారు. సాగర తీరం గుండా సంఘ విద్రోహ శక్తులు   చొరబడకుండా మెరైన్‌ పోలీసు దళాల సమన్వయంతో సాగర తీరంలో గట్టి పోలీసు బందోబస్తు ఏర్పాటైంది.
 

మరిన్ని వార్తలు