ఖైదీలతో సెల్‌ఫోన్లు.. పోలీసులు అటెన్షన్!

2 Apr, 2017 17:56 IST|Sakshi
ఖైదీలతో సెల్‌ఫోన్లు.. పోలీసులు అటెన్షన్!

శ్రీనగర్: జమ్మూకాశ్మీర్‌లోని ఓ జైలులో ఖైదీలతో సెల్‌ఫోన్లు ఉండటం కలకలం రేపింది. బారాముల్లా పోలీసులు, జైలు అధికారులు ఉత్తర కాశ్మీర్ లోని బారాముల్లా జిల్లా సబ్‌ జైలులో ఆదివారం తనిఖీలు నిర్వహించారు. అనుమానిత వస్తువులు ఖైదీల వద్ద ఉన్నట్లు గుర్తించారు. ఈ తనిఖీలలో భాగంగా కొందరు ఖైదీల వద్ద నుంచి 14 సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. 10 మంది ఖైదీలపై ఎఫ్ఐఆర్ దాఖలు చేసి విచారణ చేపట్టినట్లు చెప్పారు.

జైలులో ఉన్న ఖైదీలకు సెల్‌ఫోన్లు ఎవరు అందించారు, వారు ఎవరితో ఫోన్‌లో మాట్లాడుతున్నారు.. వీరికి ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్నాయా అనే కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. జైలులో కుట్రపూరిత వస్తువులు ఉన్నాయని సమాచారం అందుకున్న జిల్లా పోలీసు ఉన్నతాధికారులు జైలుకు రాగా వీరితో కలిసి జైలు సిబ్బంది తనిఖీలు చేపట్టారు. సెల్‌ఫోన్లతో పాటు మరికొన్ని అనుమానిత వస్తువులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఖైదీలకు సెల్‌ఫోన్లు ఎవరు అందించారన్న దానిపై ఉన్నతాధికారులు దృష్టిపెట్టారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

మరిన్ని వార్తలు