కరోనా సంక్షోభం: కేంద్రం కీలక నిర్ణయం

27 Apr, 2020 10:04 IST|Sakshi

న్యూఢిల్లీ: కరోనా సంక్షోభంతో అతలాకుతలమవుతున్న ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడం సహా, మహమ్మారి వ్యాప్తిని కట్టడి చేసే చర్యల్లో భాగంగా కేంద్ర సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. వివిధ ప్రభుత్వ విభాగాల్లో పెద్ద ఎత్తున బదిలీలు చేపట్టింది. పలు కీలక శాఖలకు 23 మంది కార్యదర్శులను కొత్తగా నియమించింది. ప్రధాన మంత్రి కార్యాలయంలో అదనపు కార్యదర్శిగా విధులు నిర్వర్తిస్తున్న అరవింద్‌ శర్మను సూక్ష్మ, చిన్న, మధ్య తరహా మంత్రిత్వ శాఖ కార్యదర్శిగా నియమించింది. అదే విధంగా మరో అడిషనల్‌ సెక్రటరీ తరుణ్‌ బజాజ్‌ను ఆర్థిక వ్యవహారాల విభాగం కార్యదర్శిగా బదిలీ చేసింది. ఇక ఆరోగ్య శాఖ కార్యదర్శి ప్రీతి సుధన్‌ పదవీ కాలాన్ని మూడు నెలలపాటు పొడిగించింది.(872కు చేరిన కరోనా మృతుల సంఖ్య)

ఇక కోవిడ్‌-19 సంక్షోభం ప్రింట్‌ మీడియాపై తీవ్ర ప్రభావం చూపుతున్న వేళ.. ఉన్నత విద్యా శాఖ కార్యదర్శి రవి ఖారేకు ప్రసార, సమాచార మంత్రిత్వ శాఖ కార్యదర్శిగా అదనపు బాధ్యతలు అప్పగించింది. అదే విధంగా గ్రామీణాభివృద్ధి శాఖ కార్యదర్శి రాజేశ్‌ భూషణ్‌ను కుటుంబ సంక్షేమ శాఖ ఓఎస్‌డీగా నియమించిన ప్రభుత్వం... ఆయన స్థానంలో నాగేంద్ర నాథ్‌ సిన్హాను అపాయింట్‌ చేసింది. రిటైర్డ్‌ ఉద్యోగుల సంక్షేమ విభాగం కార్యదర్శిగా రవి కాంత్‌ను... అదే విధంగా రోడ్డు రవాణా, రహదారుల శాఖ కార్యదర్శిగా పనిచేస్తున్న సంజీవ్‌ రంజన్‌ షిప్పింగ్‌ కార్యదర్శిగా నియమించింది. ఆయన స్థానంలో ఆర్మానే గిరిధర్‌ బాధ్యతలు స్వీకరించనున్నారు. ఇక సీబీఎస్‌ఈ చైర్‌పర్సన్‌ అనితా కర్వాల్‌ను విద్యా శాఖ కార్యదర్శిగా నియమిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 

మరిన్ని వార్తలు