ట్రాఫిక్ ఉల్లంఘనులపై కొరడా

4 Aug, 2016 01:48 IST|Sakshi
ట్రాఫిక్ ఉల్లంఘనులపై కొరడా

మోటారు సవరణ బిల్లుకు కేబినెట్ ఆమోదం
హిట్ అండ్ రన్ కేసుల్లో రూ. 2 లక్షలు
డ్రంకెన్ డ్రైవింగ్‌కు రూ.10 వేలు
సీటు బెల్టు పెట్టుకోకుంటే రూ. వెయ్యి...
హెల్మెట్ లేకుంటే రూ. 2 వేలు, మూడు నెలలు లైసెన్స్ రద్దు
మోటారు సవరణ బిల్లుకు
కేంద్ర కేబినెట్ ఆమోదం

 
న్యూఢిల్లీ: దేశంలో రోడ్డు భద్రత, రవాణా రంగంలో భారీ సంస్కరణలకు కేంద్రం తెరలేపింది. ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించే వారికి భారీ జరిమానాలు విధిస్తూ రూపొందించిన మోటారు వాహనాల (సవరణ) బిల్లు-2016కు ప్రధాని మోదీ నేతృత్వంలోని కేంద్ర కేబినెట్ బుధవారం ఆమోదం తెలిపింది. డ్రంకెన్ డ్రైవింగ్ కేసుల్లో రూ.10 వేలు, హిట్ అండ్ రన్ కేసుల్లో రూ. 2 లక్షల జరిమానాను ప్రతిపాదించారు. 18 రాష్ట్రాల రవాణా మంత్రుల సిఫార్సుల మేరకు ఈ బిల్లును రూపొందించినట్లు కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కారీ చెప్పారు. గతంలో రాష్ట్రాలు అభ్యంతరాలు వ్యక్తంచేయడంతో ఈ బిల్లు ఎంతో కాలంగా పెండింగ్‌లో ఉండింది.
 
బిల్లులోని ముఖ్యాంశాలు
 ఓవర్ స్పీడ్‌కు రూ.1,000-4,000 వరకు జరిమానా ఇన్సూరెన్స్ లేకుండా వాహనం నడిపితే రూ.2 వేలు పెనాల్టీ, 3 నెలల జైలు హెల్మెట్ లేకుండా వాహనం నడిపితే రూ. 2వేల జరిమానా, 3 నెలలపాటు లెసైన్స్ రద్దు జువెనైల్స్ అతిక్రమణకు వారి సంరక్షకుడు/యజమానికి రూ.25వేల జరిమానా, మూడేళ్ల జైలు. ఆ వాహన రిజిస్ట్రేషన్ రద్దు. ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనకు జరిమానా రూ.100 నుంచి  రూ.500కు పెంపు. అధికారుల ఆదేశాలను బేఖాతరుచేస్తే కనీస జరిమానా రూ. 2వేలు. లెసైన్స్ లేకుండా వాహనాన్ని నడిపితే రూ.5వేల జరిమానా.
 అర్హత లేకుండా వాహనం నడిపితే కనీస జరిమానా రూ.10 వేలు ప్రమాదకర డ్రైవింగ్‌కు జరిమానా రూ.1,000 నుంచి రూ.5వేలకు పెంపు  తాగి వాహనం నడిపితే రూ.10 వేల జరిమానా లెసైన్స్ నిబంధనలను ఉల్లంఘించే క్యాబ్ లాంటి వాహనాల వారికి  రూ. లక్ష వరకు జరిమానా ఎక్కువ లోడ్‌తో వెళ్లే వాహనాలకు రూ.20వేలు సీటు బెల్ట్ పెట్టుకోకుంటే రూ.వెయ్యి హిట్ అండ్ రన్ కేసుల్లో జరిమానా రూ.25వేల నుంచి రూ.2 లక్షలకు పెంపు. ప్రమాద మృతులకు రూ.10 లక్షల వరకు పరిహారమివ్వాలి. అక్టోబర్ 1, 2018 నుంచి వాహనాలకు ఆటోమేటెడ్ ఫిట్‌నెస్ పరీక్ష నిర్వహించాలి.

 దేశవ్యాప్తంగా రిజిస్ట్రేషన్ ప్రక్రియలో ఏకరూపత తెచ్చేందుకు వాహన్, సారథి వేదికల ద్వారా జాతీయ డ్రైవింగ్ లెసైన్స్ రిజిష్టర్‌ను, జాతీయ వాహనాల రిజిస్ట్రేషన్‌ను తీసుకురావాలి. దివ్యాంగులకు రవాణాలో ఉన్న ప్రతిబంధకాలకు ఈ బిల్లులో పరిష్కారాలను చూపారు. డ్రైవింగ్ లెసైన్స్ జారీ, వారికి అనువుగా వాహనాల మార్పునకు అనుమతి. మోటారు వాహనాల చట్టంలో  68 సెక్షన్లకు సవరణలు ప్రతిపాదించారు. కొత్తగా 28 సెక్షన్లు చేర్చాలని సూచించారు. రోడ్డు ప్రమాదాలను 50% తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు మంత్రి గడ్కారీ చెప్పారు.

మరిన్ని వార్తలు