ఆధార్‌ అడిగితే రూ.కోటి జరిమానా!

19 Dec, 2018 22:16 IST|Sakshi

కేంద్రం సంచలన నిర్ణయం..

న్యూఢిల్లీ: గుర్తింపు వివరాలు, అడ్రస్‌ ప్రూఫ్‌ కోసం ఆధార్‌ కార్డు మాత్రమే కావాలంటూ బ్యాంకులు, టెలికాం సంస్థలు ఒత్తిడి చేయడం కుదరదిక! ఇలా బలవంతం చేసే సంస్థలు, కంపెనీలకు కోటి రూపాయల వరకు జరిమానా విధించడంతో పాటు.. అందుకు బాధ్యులైన సిబ్బందికి జైలు శిక్ష పడేలా కేంద్రప్రభుత్వం నిబంధనలు సవరించింది. శిక్షాకాలం మూడు నుంచి పదేళ్ల వరకు ఉండనుంది. ఈమేరకు సవరించిన నిబంధనలకు కేంద్ర కేబినెట్‌ సోమవారం ఆమోదం తెలిపింది. పార్లమెంటులో ఆమోదం పొందిన వెంటనే కొత్త సవరణలు అమల్లోకి రానున్నాయి.

కాగా వినియోగదారులు కావాలంటే తమ ఆధార్‌ గుర్తింపును కూడా కేవైసీ ప్రక్రియ కోసం ఉపయోగించుకునేలా సవరణలు చేశారు. ఆధార్‌పై సుప్రీంకోర్టు తీర్పు మేరకు భారత టెలీగ్రాఫ్, పీఎంఎల్‌ఏ చట్టాలకు కేంద్రం సవరణలు చేసింది. ప్రభుత్వ నిధులతో అందించే సంక్షేమ పథకాలకు మాత్రమే ఆధార్‌ కార్డు తప్పనిసరి చేయవచ్చునని సుప్రీంకోర్టు తన తీర్పులో స్పష్టం చేసింది. మొబైల్‌ కనెక్షన్, బ్యాంకు ఖాతాలు తెరిచేందుకు వినియోగదారులు సాధారణంగా పాస్‌పోర్టులు, రేషన్‌ కార్డులను గుర్తింపు కార్డులుగా సమర్పిస్తున్న సంగతి తెలిసిందే.

కాగా తమ రాష్ట్రాల్లో ఆధార్‌ను తప్పనిసరి చేసుకునేలా రాష్ట్ర ప్రభుత్వాలకు వెసులుబాటు కల్పించాలని కూడా కేంద్రం నిర్ణయించింది. అయితే రాష్ట్రాలు కూడా సుప్రీం తీర్పునకు అనుగుణంగానే వ్యవహరించాలని సూచించింది. ఇకపై వినియోగదారుడి అనుమతి లేకుండా ఆధార్‌ ధ్రువీకరణ కోసం వివరాలు సేకరిస్తే రూ.10 వేలు జరిమానతో పాటు మూడేళ్ల వరకు జైలు శిక్ష విధిస్తారు. క్యూఆర్‌ కోడ్స్‌ ద్వారా చేసే ఆఫ్‌లైన్‌ వెరిఫికేషన్లకు కూడా ఈ నిబంధనలు వర్తిస్తాయి.  

మరిన్ని వార్తలు