ఏప్రిల్ 20 తర్వాత లాక్‌డౌన్‌ సడలింపు

15 Apr, 2020 15:53 IST|Sakshi

మే 3 వరకూ లాక్‌డౌన్‌ పటిష్టంగా అమలు

ఉపాధి హామీ పథకం పనులకు పూర్తి మినహాయింపు

హాట్‌స్పాట్‌ , కంటోన్మెంట్ జోన్ల పరిధిలో ప్రత్యేక దృష్టి

వీడియో కాన్ఫరెన్స్‌లో కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబ

సాక్షి, న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా మే 3 వరకూ లాక్‌డౌన్‌ను పటిష్టంగా అమలు చేయాలని కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబ అన్ని రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులను, డీజీపీను ఆదేశించారు. ఈమేరకు బుధవారం ఆయన ఢిల్లీ నుంచి కరోనా వైరస్‌పై వివిధ రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, డీజీపీలు, ఆరోగ్య శాఖ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాజీవ్ గౌబ మాట్లాడుతూ... దేశంలోని అన్ని వర్గాల ప్రజలు ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని అందరితో సంప్రదించి, వారి అభిప్రాయాలను తీసుకున్న తర్వాతనే ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ మే 3వరకూ లాక్‌డౌన్‌ను పెంచారని పేర్కొన్నారు. లాక్‌డౌన్‌కు సంబంధించిన నిబంధనలు ఖచ్చితంగా అమలయ్యే విధంగా చూడాలని స్పష్టం చేశారు. హాట్ స్పాట్ ప్రాంతాల్లోను, కంటోన్మెంట్ జోన్ల పరిధిలో ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. కరోనాకు సంబంధించిన పరీక్షలు అధిక సంఖ్యలో నిర్వహించాలని చెప్పారు.

లాక్‌డౌన్‌కు సంబంధించి కొన్ని సేవలకు  ఏప్రిల్‌ 20 నుంచి  మినహాయింపులు ఇవ్వడం జరుగుతుందని అందుకు సంబంధించిన మార్గదర్శకాలను కేంద్ర ప్రభుత్వం జారీ చేస్తుందని రాజీవ్ గౌబ తెలిపారు. లాక్‌డౌన్‌ నేపధ్యంలో దేశ వ్యాప్తంగా నిత్యావసర వస్తువులు కూరగాయలు ఇతర వస్తువులకు ఇబ్బంది లేకుండా ఇప్పటికే చర్యలు తీసుకోగా ఏప్రిల్ 20 నుంచి మరిన్ని సేవలకు లాక్‌డౌన్‌ నుంచి మినహాయింపులు ఇవ్వడం జరుగుతుందని స్పష్టం చేశారు. సరుకు రవాణా చేసే వాహనాలకు పూర్తి మినహాయింపులు ఉంటుందని తెలిపారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థను మెరుగు పరిచేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటారని తెలిపారు. వ్యవసాయ,అనుబంధ రంగాల పనులు పూర్తిగా జరిగేలా చూడాలని చెప్పారు.

అలాగే ఉపాధి హామీ పథకం పనులకు పూర్తి మినహాయింపును ఇవ్వడం జరిగిందని అయితే ఆ పనుల్లో పాల్గొనే కూలీలు తప్పనిసరిగా మాస్క్లను ధరించడం తోపాటు సామాజిక దూరాన్ని పాటించేలా చూడాలని అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని వివిధ చిన్న తరహా పరిశ్రమలన్నీ పనిచేసేలా చర్యలు తీసుకోవడం జరుగుతుందని అయితే అక్కడ పనిచేసే కార్మికులకు మాస్క్లను ధరించడం సామాజిక దూరాన్ని పాటించాలని చెప్పారు. కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాని గ్రీన్ జోన్లు ప్రాంతాల్లో యధావిధిగా కార్యకలాపాలు జరిగేలా చర్యలు చేపట్టడం జరుగుతుందని రాజీవ్ గౌబ చెప్పారు.

ఏపీలో 165 కంటోన్మెంట్ జోన్లు
ఈ వీడియో సమావేశంలో పాల్గొన్న ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం 165 కంటోన్మెంట్ జోన్లు ఉన్నాయని వివరించారు. లాక్ డౌన్ కు సంబంధించిన అన్ని నిబంధనలను ఖచ్చితంగా అమలయ్యేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ఆసుపత్రుల సన్నద్ధతకు తగిన చర్యలు తీసుకుంటుంన్నామని అదే విధంగా అధిక సంఖ్యలో కరోనా పరీక్షల నిర్వహణకు చర్యలు తీసుకోవడం జరుగుతోందని నీలం సాహ్ని వివరించారు. కాగా రాష్ట్రంలో కరోనా ప్రవేట్ టెస్టింగ్ ల్యాబ్స్ లేవని అన్నారు. ఈ వీడియో సమావేశంలో డీజీపీ గౌతం సవాంగ్, వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ కె.భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు