ఖర్చుపై ఈసీ డేగ కన్ను

5 Jan, 2017 02:34 IST|Sakshi
ఖర్చుపై ఈసీ డేగ కన్ను

రూ. 20 వేలపై లావాదేవీలన్నీ నగదు రహితమే
విస్తృత పర్యవేక్షణ యంత్రాంగం ఏర్పాటు
విరాళాలు రూ. 2 వేల నగదు వరకే పరిమితం చేసే యోచన


సాక్షి, న్యూఢిల్లీ: ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ధనవ్యయం తగ్గించేందుకు, నల్లధన వినియోగం తగ్గించేందుకు వినూత్నరీతిలో ముందుకెళ్లాలని ఈసీ భావిస్తోంది. బుధవారం ఐదు రాష్ట్రాల ఎన్నికల షెడ్యూలు ప్రకటన సందర్భంలో కేంద్ర ఎన్నికల సంఘం పలు కీలక ప్రకటనలు చేసింది. అభ్యర్థులు రూ. 20 వేలకు మించి చేసే ఖర్చును చెక్‌ ద్వారా చెల్లించాలని షరతు విధించింది. ప్రధాన ఎన్నికల కమిషనర్‌ నసీం జైదీ దీనిపై వివరిస్తూ ‘పంజాబ్, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రాల్లో అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థుల ఖర్చు పరిమితి రూ. 28 లక్షలు మాత్రమే.

అలాగే మణిపూర్, గోవా రాష్ట్రాల్లో ఈ ఖర్చు రూ. 20 లక్షలు మాత్రమే ఉండాలి. ఎన్నికల ఖర్చును పర్యవేక్షించేందుకు 400 మంది పరిశీలకులను ఏర్పాటుచేశాం. నిఘా బృందాలు ఈ దిశగా పనిచేస్తాయి. అభ్యర్థులు బ్యాంకుల్లో ఖాతా తెరవాలి. రూ. 20,000 కంటే ఎక్కువగా ఖర్చు పెట్టినా ఈ ఖాతా నుంచి చెక్‌ రూపంలో ఇవ్వాలి. విరాళాలు, రుణాలు రూ. 20 వేల కంటే ఎక్కువగా తీసుకున్నప్పుడు డీడీ ద్వారా లేదా చెక్‌ ద్వారా  మాత్రమే తీసుకోవాలి’ అని పేర్కొన్నారు. వాస్తవానికి కేంద్ర ఎన్నికల సంఘం విరాళాలు, రుణాలు నగదు రూపంలో అయితే రూ. 2 వేలకు పరిమితం చేయాలన్న యోచనతో ఉందన్నారు.

ఎన్నికల తర్వాతే బడ్జెట్‌పై పరిశీలన
ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు పూర్తయిన తర్వాతే కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టాలన్న పలు రాజకీయ పక్షాల విజ్ఞప్తులను పరిశీలిస్తామని కేంద్ర ఎన్నికల సంఘం పేర్కొంది. ఐదు రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారం జరగనున్న నేపథ్యంలో ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టకుండా వాయిదా వేయాలని కోరుతూ పలు రాజకీయ పార్టీలు తనకు విజ్ఞప్తులందాయని పేర్కొంది.

>
మరిన్ని వార్తలు