దేశీయ అవసరాలు తీరాకే..! 

8 Apr, 2020 02:40 IST|Sakshi

హైడ్రాక్సీ క్లోరోక్విన్, పారాసిటమాల్‌ ఎగుమతులపై కేంద్రం

మందుల ఎగుమతులపై ఆంక్షలు సడలింపు

పరిస్థితులనుబట్టి ఆయా దేశాలకు ప్రాధాన్యం

విదేశీ వ్యవహారాల శాఖ స్పష్టీకరణ

ఇవ్వకుంటే ప్రతిచర్యలుంటాయన్న ట్రంప్‌

న్యూఢిల్లీ: కోవిడ్‌ మహమ్మారిని ఎదుర్కొనేందుకు ఉపయోగపడుతుందని అనుకుంటున్న హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ మందుపై భారత్, అమెరికాల మధ్య రగడ మొదలైంది. ఆ మందు వెంటనే తమకు పంపాలని ట్రంప్‌ కొంతకాలంగా డిమాండ్‌ చేస్తూండగా.. సోమవారం ఒకడుగు ముందుకేసి భారత్‌ సరఫరా చేయకపోతే ప్రతిచర్యలు ఉంటాయని హెచ్చరించారు. భారత్‌ అటు కర్ర విరగకుండా.. ఇటు పామూ చావకుండా అన్నట్లుగా మందుల ఎగుమతులపై విధించిన నిషేధాన్ని పాక్షికంగా ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకుంది. అంతేకాకుండా.. క్లోరోక్విన్‌ కోసం ఇప్పటికే కొన్ని దేశాలు ఆర్డర్లు ఇచ్చినప్పటికీ పరిస్థితులను బట్టి ఎగుమతులు మొదలుపెడతామని, అది కూడా దేశీయ అవసరాలన్నీ తీరిన తరువాత మాత్రమే జరుగుతుందని కుండబద్దలు కొట్టింది.

‘కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో మానవతా దృష్టితో తగు మోతాదులో పారాసిటమాల్, హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ ఉత్పత్తికి లైసెన్సులు ఇవ్వాలని భారత్‌ నిర్ణయించంది. మా సామర్త్యంపై ఆధారపడ్డ ఇరుగు పొరుగు దేశాలకు మందులు అందిస్తాం’అని విదేశీ వ్యవహారాల శాఖ అధికార ప్రతినిధి అనురాగ్‌ శ్రీవాస్తవ తెలిపారు. మహమ్మారి కారణంగా బాగా దెబ్బతిన్న దేశాలకూ ఈ అత్యవసర మందులు సరఫరా చేస్తామని ఆయన తెలిపారు. అంతర్జాతీయ సమాజం పరస్పరం సహకరించుకోవాలన్నదే భారత్‌ విధానమని, ఇతర దేశాల నుంచి భారతీయులను ఖాళీ చేయించే విషయంలోనూ తాము ఇదే స్ఫూర్తితో వ్యవహరించామని ఆయన వివరించారు. బాధ్యతాయుతమైన దేశంగా ముందు దేశ జనాభాకు తగ్గ మందులు ఉంచుకోవాల్సి ఉంటుందని, ఆయన స్పష్టం చేశారు. ఈ కారణంగానే పాక్షిక నిషేధం విధించామని, పరిస్థితులను సమీక్షించిన తరువాత ఎత్తివేస్తున్నామని చెప్పారు. మలేరియా చికిత్సలో వాడే హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ను ప్రపంచంలోనే అత్యధికంగా ఉత్పత్తి చేసే దేశం భారత్‌ కావడం గమనార్హం.

నిస్పృహతోనే బెదిరింపు
తమకు కావాల్సిన మందులు సరఫరా చేయని పక్షంలో భారత్‌పై ప్రతిచర్యలు ఉంటాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ హెచ్చరించిన కొన్ని గంటల్లోనే భారత్‌ ఎగుమతులపై నిషేధాన్ని పాక్షికంగా ఎత్తివేయడం గమనార్హం. గత ఆదివారమే మోదీతో జరిగిన ఫోన్‌ సంభాషణల్లో హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ను తమకు సరఫరా చేయాలని ట్రంప్‌ విజ్ఞప్తి చేశారు. తాజాగా ప్రతిచర్యలు ఉంటాయన్న ట్రంప్‌ వ్యాఖ్య నిస్పృహతో అప్పటికప్పుడు చేసింది మాత్రమేనని భారత్‌ భావిస్తోంది. వైట్‌హౌస్‌లో సోమవారం జరిగిన విలేకరుల సమావేశంలో ట్రంప్‌ మాట్లాడుతూ.. ఒకవేళ భారత్‌ ఎగుమతులకు అనుమతించకపోతే ఆది వారి నిర్ణయమని, ప్రతీకార చర్యలు తప్పకుండా ఉంటాయని స్పష్టం చేశారు.

మరిన్ని వార్తలు