కేంద్ర ఉద్యోగులకు మరో 10% డీఏ

21 Sep, 2013 01:31 IST|Sakshi

కేంద్ర కేబినెట్ ఆమోదం  
 2013 జూలై 1 నుంచి వర్తింపు


 సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వోద్యోగులకు దసరా ధమాకా. వారికి 10 శాతం అదనపు విడత కరువు భత్యాన్ని (డీఏ), పింఛనుదారులకు అంతే మొత్తం అదనపు డీఆర్‌ను కేంద్రం ప్రకటించింది. ఈ ప్రతిపాదనకు ప్రధాని మన్మోహన్‌సింగ్ అధ్యక్షతన శుక్రవారం జరిగిన కేంద్ర మంత్రివర్గం సమావేశం ఆమోదముద్ర వేసింది. ఈ నిర్ణయంతో దాదాపు 50 లక్షల మంది కేంద్ర ఉద్యోగులు, 30 లక్షల మంది పింఛన్‌దారులు లబ్ధి పొందనున్నారు. వారికి బేసిక్‌లో 90శాతం డీఏ / డీఆర్ లభించనుంది. పెంపు 2013 జూలై 1 నుంచి వర్తిస్తుంది. దీన్ని నగదు రూపంలో చెల్లిస్తారని కేంద్ర సమాచార ప్రసార మంత్రి మనీశ్ తివారీ విలేకరులకు చెప్పారు. దీని వల్ల ఖజానాపై ఏటా రూ.10,879.60 కోట్ల అదనపు భారం పడుతుందని ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది. ఆరో కేంద్ర వేతన సంఘం సిఫార్సుల ఆధారంగా రూపొందించి న ఫార్ములాకు అనుగుణంగా ఈ పెంపును ఖరారు చేసినట్టు పేర్కొంది. మరోవైపు మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా బోర్డ్ ఆఫ్ గవర్నర్స్‌కు చట్టబద్ధతను కొనసాగించేందుకు వీలుగా కొత్త ఆర్డినెన్స్ జారీకి కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది.
 
 కార్మికుల భద్రతకు సౌదీతో ఒప్పందం
 సౌదీ అరేబియాలో గృహ కార్మికులుగా పని చేస్తున్న దాదాపు 6 లక్షల మంది భారతీయులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి ఆ దేశంతో ఒప్పందం కుదుర్చుకునేందుకు కేబినెట్ అంగీకారం తెలిపింది. కార్మికులకు మెరుగైన పని వాతావరణాన్ని కల్పించడం దీని ముఖ్యోద్దేశం. ఈ ఒప్పందం ప్రకారం కార్మికుల కాంట్రాక్టు నియమ నిబంధనలు, పని వాతావరణం తదితరాలను యజమానులు సౌదీలోని భారత అధికార వర్గాలకు స్పష్టంగా వివరించాల్సి ఉంటుంది.  సౌదీలో పని చేస్తున్న మొత్తం 28 లక్షల మంది భారతీయుల ప్రయోజనాల పరిరక్షణ దిశగా ఇది తొలి అడుగని అధికారులు పేర్కొన్నారు.
 
 ప్లే స్కూళ్ల నియంత్రణ విధానానికి ఓకే: దేశంలోని ప్లే స్కూళ్లు, శిశు సంరక్షణాలయాల(క్రెచ్) నియంత్రణ కోసం జాతీయస్థాయి మండలిని ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం అంగీకరించింది. దీనికి సంబంధించిన జాతీయ శిశు సంరక్షణ, విద్య(ఎన్‌ఈసీసీఈ) విధానం ముసాయిదాకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ప్లే స్కూళ్లు, క్రెచ్‌లు అందించే సేవలు, విద్యపై పర్యవేక్షణ కోసం ఈ విధానాన్ని రూపొందించారు.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు