‘ఆరోగ్య సేతు’ భద్రతా సమస్య.. కేంద్రం క్లారిటీ

6 May, 2020 15:35 IST|Sakshi

న్యూఢిల్లీ : ‘ఆరోగ్య సేతు’ యాప్‌ డేటా సెక్యూరిటీకి ఎలాంటి సమస్య లేదని, సమాచారం సురక్షితంగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. యాప్‌ ద్వారా ఇప్పటి వరకు ఎటువంటి భద్రతా ఉల్లంఘనలు గుర్తించలేదని, ఆరోగ్యా సేతు ప్రతి ఒక్కరికీ భరోసా ఇస్తుందని కేంద్రం తెలిపింది. ఈ మేరకు బుధవారం ఓ ప్రకటన విడుదల చేసింది. కాగా కరోనా వైరస్ నియంత్రణ చర్యల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఆరోగ్య సేతు యాప్‌ తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఇది కరోనా సమాచారాన్ని తెలుసుకునేందుకు, మనలో కరోనా లక్షణాలు ఉన్నాయో లేవో తెలిపి, పలు సలహాలు సూచనలు అందిస్తోంది. అయితే ప్రస్తుతం​ ఆరోగ్య సేతు యాప్‌లో ఉన్న ప్రజల సమాచారం భద్రంగా లేదంటూ, వివరాలు హ్యకింగ్‌ చేసే అవకాశం ఉందని ఫ్రెంచ్‌ హ్యకర్‌ మంగళవారం ట్విటర్‌లో ప్రభుత్వానికి సవాల్‌ విసిరాడు. (విషాదం: ‘వాడిని కనీసం ముట్టుకోలేకపోయా’)

ఈ యాప్‌ భద్రతపై అనుమానాలు వ్యక్తం చేస్తూ ఇందులో సెక్యూరిటీ సమస్యలు ఉన్నట్లు పేర్కొన్నారు. దీని ద్వారా సుమారు 90 మిలియన్ల మంది భారతీయుల సమాచారం ప్రమాదంలో పడిందని హెచ్చరించాడు. అయితే దీనిపై స్పందించిన కేంద్రం హ్యాకర్‌ వాదనలను తోసిపుచ్చింది. ప్రజల సమాచారానికి ఎటాంటి భద్రతా సమస్యలు లేవని స్పష్టం చేసింది. ఆరోగ్య సేతు యాప్‌ను నిరంతరం పర్యవేక్షిస్తున్నామని, డేటా చోరీ కాలేదని పేర్కొంది. యాప్‌ ఉపయోగిస్తున్న ఏ ఒక్క వ్యక్తికి సంబంధించిన సమాచారం కూడా హ్యకింగ్‌కు గురవ్వలేదని ట్విటర్‌లో క్లారిటీ ఇచ్చింది. కాగా ఆరోగ్యా సేతు ట్విట్టర్‌లో విడుదల చేసిన ప్రకటనపై హ్యకర్‌ ఇలియట్ ఆల్డర్‌సన్ స్పందించారు. ‘యాప్‌లో ఎలాంటి లోపాలు లేవని మీరు చెప్పారు. మేము దానిని సమీక్షించి రేపు మళ్లీ వస్తాం’.. అంటూ బదులిచ్చాడు. 

మరిన్ని వార్తలు