సెన్సార్ బోర్డు అధికారాలకు కత్తెర!

13 Aug, 2016 08:43 IST|Sakshi
సెన్సార్ బోర్డు అధికారాలకు కత్తెర!

ఇటీవలి కాలంలో తీవ్ర వివాదాలకు కారణం అవుతున్న సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (సీబీఎఫ్‌సీ) అధికారాలకు కత్తెర వేయాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. గత సంవత్సరం పహ్లజ్ నిహలానీ దాని చైర్మన్‌గా అధికారం చేపట్టినప్పటి నుంచి వివాదాలు మొదలయ్యాయి. దాంతో సినిమాలను సెన్సార్ చేసే విషయంలో ఈ సంస్థకు ముకుతాడు వేయాలని కేంద్ర సర్కారు అనుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు కొత్త సినిమాటోగ్రఫీ చట్టాన్ని అమలులోకి తీసుకురావాలని కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వశాఖ భావిస్తోంది. దీన్ని పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. అది గనక చట్టరూపం దాలిస్తే.. సీబీఎఫ్‌సీకి ఇక కేవలం సినిమాలకు సర్టిఫికెట్ ఇవ్వడం తప్ప సెన్సార్ చేసే అవకాశం ఉండదు.

ఉడ్తా పంజాబ్ సినిమాకు ఏకంగా 90 కట్‌లు చెప్పడంతో ఆ సినిమా దర్శక నిర్మాతలు కోర్టుకు వెళ్లడం, చివరకు సుప్రీంకోర్టు కేవలం ఒకే ఒక్క కట్‌తో సినిమా విడుదలకు అంగీకరించడం లాంటి పరిణామాలతో సీబీఎఫ్‌సీ పరువు గంగలో కలిసిపోయింది. దాంతో ఇక దాని అధికారాలకు కత్తెర వేయక తప్పదని కేంద్రం నిర్ణయించింది. సినిమాలను వాటి కంటెంట్ ఆధారంగా వివిధ విభాగాలుగా చేయడం తప్ప సీన్లు, డైలాగులు కట్ చేయాలని చెప్పే అధికారం సీబీఎఫ్‌సీకి ఉండకూడదని భావిస్తోంది. సమాచార మంత్రిత్వ శాఖ పరిధిలో ఉండే సీబీఎఫ్‌సీ.. స్వతంత్ర సంస్థగా వ్యవహరిస్తోంది.

మరిన్ని వార్తలు