రాజీనామా చేయండి...

26 Feb, 2015 01:50 IST|Sakshi

-  మధ్యప్రదేశ్ గవర్నర్‌కు కేంద్రం ఆదేశం


న్యూఢిల్లీ: మధ్యప్రదేశ్ ప్రొఫెషనల్ ఎగ్జామినేషన్ బోర్డులో జరిగిన రిక్రూట్‌మెంట్ స్కాంలో మధ్యప్రదేశ్ గవర్నర్ రామ్‌నరేశ్ యాదవ్‌పై  ఎఫ్‌ఐఆర్ నమోదైనందున రాజీనామా చేయాలంటూ ఆయనను కేంద్రం ఆదేశించింది. కేసు వ్యవహారంపై నివేదికను ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం, గవర్నర్ కార్యాలయాన్ని  కేంద్ర హోం శాఖ కోరినట్లు సమాచారం. అయితే,  యాదవ్ బుధవారం రాజీనామా చేసినట్లు మీడియాలో తొలుత కథనాలు వెలువడ్డాయి. కానీ ఆయన రాజీనామా చేయలేదని రాజ్‌భవన్ వర్గాలు చెప్పాయి.  
 
 రాష్ట్ర హైకోర్టు  ఆదేశాల మేరకు యాదవ్‌పై కేసు నమోదైంది. ఐదుగురి పేర్లను ఫారెస్ట్ గార్డుల కొలువులకు  యాదవ్ సిఫార్సు చేసినట్లు, కాంట్రాక్టు టీచర్ల నియామకం కోసం యాదవ్ కుమారుడు శైలేశ్ డబ్బు తీసుకున్నట్లు ఆరోపణలు వచ్చాయి. బుధవారం భోపాల్‌లో యాదవ్‌తో మిజోరం గవర్నర్  అజీజ్ ఖురేషీ రాజ్‌భవన్‌లో భేటీ అయ్యారు. ఖురేషీ ద్వారా రాష్ట్రపతి అపాయింట్‌మెంట్‌ను యాదవ్ కోరినట్లు సమాచారం.


 

మరిన్ని వార్తలు