100 రోజుల స్కూల్స్‌ వైపు ప్రభుత్వ ఆలోచన

29 May, 2020 16:40 IST|Sakshi

న్యూఢిల్లీ: కరోనా వైరస్‌ ఉదృతితో అన్ని వ్యవస్థలు సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి. వైరస్‌ ఎక్కువగా పిల్లలు, వృద్ధులకు వ్యాపిస్తుందన్న నిపుణుల హెచ్చరికలతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమయ్యింది. ముఖ్యంగా సరికొత్త ప్రణాళికతో విద్యావ్యవస్థ నిర్వహణకు ప్రభుత్వం వ్యూహాలు రచిస్తున్నట్లు నిపుణులు చెబుతున్నారు. గతంలో మాదిరిగా స్కూల్స్‌కు 220 పనిదినాలు 1,320గంటల తరగతి బోధన ఇక మీదట ఉండదని విద్యావేత్తలు భావిస్తున్నారు. గత విద్యావ్యవస్థకు ప్రత్యామ్నాయంగా రాబోయే విద్యా సంవత్సరంలో స్కూళ్లకు 100 రోజుల పనిదినాలు, 600 గంటల తరగతి బోధనకు ప్రభుత్వం ఆమోదం తెలిపే అవకాశం ఉందని ప్రభుత్వం వర్గాలు తెలిపాయి.  

అలాగే విద్యార్థికి ఇంట్లోనే ఆన్‌లైన్‌ బోధనతో 100 రోజులు, 600 అభ్యాస గంటల విద్యా ప్రణాళికను ప్రభుత్వం రచిస్తున్నట్లు నిపుణులు విశ్లేషిస్తున్నారు. కాగా మరో 20రోజులు విద్యార్థి మానసిక వికాసాన్ని పెంచే విధంగా డాక్టర్లు, కౌన్సెలర్లతో విద్యార్థులకు ప్రేరణ కలిగించే కార్యక్రములు చేపట్టనున్నట్లు ప్రభుత్వం భావిస్తోంది. ఆన్‌లైన్‌ సౌకర్యాలు లేని విద్యార్థులపై  స్కూల్‌ యాజమాన్యాలు దృష్టి పెట్టాలని హెచ్‌ఆర్‌డీ మంత్రిత్వ శాఖ సూచించింది.

చదవండి: స్కూల్స్‌ పునఃప్రారంభానికి కసరత్తు

మరిన్ని వార్తలు