పెన్షన్ల కోతపై స్పష్టతనిచ్చిన కేంద్రం

19 Apr, 2020 14:27 IST|Sakshi

న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల పింఛన్లు తగ్గించడం కానీ, నిలిపివేయడం కానీ చేయడం లేదని కేంద్రం స్పష్టం చేసింది. కరోనా వ్యాప్తి కారణంగా నెలకొన్న ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో పింఛన్లలో కేంద్రం కోత విధించనుందనే వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. దీంతో చాలా మంది రిటైర్డ్‌ ఉద్యోగులు ఆందోళనకు గురయ్యారు. అయితే తాజాగా ఆ వార్తలపై స్పందించిన సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, పెన్షన్‌ల మంత్రిత్వ శాఖ.. అందులో ఎలాంటి వాస్తవం లేదని తెలిపింది. ఇంతకు ముందు చెప్పినట్టుగానే పింఛన్లు తగ్గించే ఆలోచన ఏది లేదని స్పష్టం చేసింది. ఈ విషయంలో భారత ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాలు తీసుకోలేదని వెల్లడించింది. పింఛన్‌దారుల సంక్షేమం కోసం ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొంది. పెన్షన్‌దారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పింది

అలాగే ఆర్థిక మంత్రిత్వ శాఖ కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేసింది. పింఛన్లు తగ్గించే ఎలాంటి ప్రతిపాదన తమ వద్ద లేదని స్పష్టం చేసింది. ‘కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న పింఛన్లలో 20 శాతం కోత విధించనున్నట్టు వార్తలు వస్తున్నాయి. అయితే ఆ వార్తలు నిరాధారమైనవి’ అని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ట్వీట్‌ చేసింది. 

మరిన్ని వార్తలు