ఇల్లు కొంటే లాభమే!

11 Feb, 2017 07:17 IST|Sakshi
ఇల్లు కొంటే లాభమే!
  • చెల్లించే వడ్డీలో కేంద్రం భారీ రాయితీలు
  • ఏటా రూ.18 లక్షల ఆదాయం ఉన్నవారికీ వర్తింపు
  • గరిష్టంగా రూ.2.4 లక్షల వరకు ప్రయోజనం
  • ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన కింద పొందే అవకాశం
  • మూడు శ్లాబ్‌ల కింద భిన్న రకాలుగా సబ్సిడీ
  • న్యూఢిల్లీ: మొదటిసారి రుణం తీసుకుని ఇల్లు కొనుక్కునే వారికి, కట్టించుకునే వారికి శుభవార్త. వార్షికాదాయం రూ.18 లక్షల వరకూ ఉన్నా సరే.. వారు ఇంటికోసం తీసుకునే రుణంలో కొత్త మొత్తానికి కేంద్ర ప్రభుత్వం వడ్డీ సబ్సిడీ ఇవ్వనుంది. 20 ఏళ్లకు గృహ రుణం తీసుకుంటే వారు చెల్లించే వడ్డీలో దాదాపు రూ.2.4 లక్షల మొత్తాన్ని కేంద్రం సబ్సిడీగా చెల్లిస్తుంది. ఈ మేరకు నెలసరి వాయిదాలు సుమారు రూ.2,200 మేర తగ్గడం ఇందులోని ప్రయోజనం.

    2022 నాటికి అందరికీ సొంతిల్లు లక్ష్యాన్ని సాధించేం దుకు కేంద్రం ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన కింద తాజాగా రెండు సబ్సిడీ పథకాలను తీసుకువచ్చింది. 20 ఏళ్ల కాల వ్యవధికి ఇంటి రుణం తీసుకునే వారు కూడా ఈ సబ్సిడీలను పొందేందుకు అర్హులు. ఇప్పటికే సొంతింటికి సంబంధించి ఓ సబ్సిడీ పథకం అమల్లో ఉంది. కానీ వార్షికాదాయం రూ.6 లక్షలలోపు ఉన్నవారు, అది కూడా 15 ఏళ్ల కాల వ్యవధికి మించని రుణం తీసుకున్న వారికి మాత్రమే అది అందుతోంది. కేంద్రం తాజాగా దీన్ని మరింత సరళీకరించింది.

    ఒక్కొక్కరికీ ఒక్కోలా...
    వార్షికాదాయాన్ని బట్టి ఇంటి రుణంపై కేంద్రం భరించే సబ్సిడీ కొద్దిగా మారుతుంది. రూ.6 లక్షల్లోపు వార్షికాదాయం ఉన్న వారు రుణంపై ఇల్లు కొంటే.. వారికి వడ్డీపై 6.5 శాతం రాయితీ లభిస్తుంది. అయితే ఎంత రుణం తీసుకున్నా కేవలం రూ.6 లక్షల రుణం వరకే వడ్డీ సబ్సిడీ పరిమితం అవుతుంది. మిగతా రుణంపై వడ్డీ మామూలుగానే ఉంటుంది. ఉదాహరణకు 9 శాతం వడ్డీతో రూ.20 లక్షల రుణం తీసుకున్నారనుకుందాం. అప్పుడు రూ.6 లక్షలపై 6.5 శాతం రాయితీపోను కేవలం 2.5 శాతం వడ్డీ చెల్లిస్తే చాలు. మిగతా రూ.14 లక్షలకు వడ్డీ 9 శాతం చెల్లించాల్సి ఉంటుంది.

    ఏడాదికి రూ.12 లక్షల వరకు ఆదాయం ఉన్న వారు వడ్డీపై 4 శాతం రాయితీని అందుకోవచ్చు. ఈ రాయితీ రుణం మొత్తంలో రూ.9 లక్షలకే పరిమితం. ఏడాదికి రూ.18 లక్షల వరకు ఆదాయమున్న వారు.. వారి రుణంలో రూ.12 లక్షల మొత్తానికి 3 శాతం వడ్డీ రాయితీ పొందవచ్చు. ఈ మూడూ శ్లాబ్‌లలో ఉన్న వారు 20 ఏళ్ల కాల వ్యవధికి ఇంటి రుణంపై నికర వడ్డీ సబ్సిడీ రూపేణా రూ.2.4 లక్షల (9 శాతం వడ్డీ ఆధారంగా) వరకు ప్రయోజనం పొందవచ్చు. అంటే నెలసరి వాయిదా రూ.2,200 వరకు తగ్గుతుంది. ఇంటి రుణంపై చెల్లించే వడ్డీకి, అసలుకు ఇప్పటికే ఆదాయపన్ను పరంగా పలు మినహాయింపులున్న విషయం తెలిసిందే. తాజా సబ్సిడీలు వాటికి అదనం కావడం మరింత ఆకర్షణీయం. నేషనల్‌ హౌసింగ్‌ బ్యాంక్‌ (ఎన్‌హెచ్‌బీ), హడ్కోలకు ఈ సబ్సిడీ పథకాలను అమలు చేసే బాధ్యతను కేంద్రం కట్టబెట్టింది.

>
మరిన్ని వార్తలు