రేపు కశ్మీర్‌లో ఆంక్షల సడలింపు..!

8 Aug, 2019 12:55 IST|Sakshi

ముస్లిం ప్రార్థనల సందర్భంగా కేంద్రం నిర్ణయం?

బక్రీద్‌ పర్వదినం నాడు నిషేధాజ్ఞలు ఎత్తివేసే అవకాశం

శ్రీనగర్‌/న్యూఢిల్లీ : ఆర్టికల్‌ 370 రద్దు, జమ్మూకశ్మీర్‌ విభజన నేపథ్యంలో కశ్మీర్‌ లోయలోని పరిస్థితులను కేంద్ర ప్రభుత్వం నిశితంగా గమనిస్తోంది. కేంద్రం నిర్ణయాల అనంతరం భద్రతా బలగాల నీడలో ఉన్న కశ్మీర్‌లో పెద్దగా అలజడులు చెలరేగలేదు. చిన్నాచితక ఘటనలు మినహా ఆందోళనలు అంతగా చోటుచేసుకోలేదు. ఈ నేపథ్యంలో  శుక్రవారం ముస్లిం ప్రజల ప్రార్థనల సందర్భంగా కేంద్రం భద్రతా ఆంక్షలను సడలించే అవకాశముందని తెలుస్తోంది. అదేవిధంగా సోమవారం బక్రీద్‌ ఉండటంతో ఆ రోజు కూడా నిషేధాజ్ఞలను సడలించి.. జనజీవనానికి ఇబ్బందులు లేకుండా చూడాలని కేంద్రం భావిస్తున్నట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. 

ఆగస్టు 12న ముస్లిం ప్రజలు భక్తిశ్రద్ధలతో జరుపుకునే బక్రీద్‌ పర్వదినం సందర్భంగా లోయలో 144 సెక్షన్‌ ఎత్తివేతతోపాటు ఇంటర్నెట్‌, మొబైల్‌ సేవలను తాత్కాలికంగా పునరుద్ధరించే అవకాశముంది. లోయలోని పరిస్థితులను జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ దోవల్‌ స్వయంగా దగ్గరుండి పరిశీలిస్తున్నారు. భద్రతా బలగాల ఆధ్వర్యంలో కొనసాగుతున్న బందోబస్తును పర్యవేక్షించడంతోపాటు కశ్మీర్‌ విషయంలో కేంద్రం తాజా నిర్ణయాలపై స్థానికుల అభిప్రాయాలను ఆయన తెలుసుకుంటున్నారు. ఈ సందర్భంగా స్థానికులతో కలిసి భోజనం చేసిన వీడియో ఒకటి తాజాగా వెలుగుచూసిన సంగతి తెలిసిందే.  ఆర్టికల్‌ 370 రద్దును స్థానికులు స్వాగతిస్తున్నారని ఆయన కేంద్రానికి నివేదిక ఇచ్చినట్టు తెలుస్తోంది. 

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా