కోటా ఆస్పత్రికి ఢిల్లీ ఎయిమ్స్‌ వైద్యులు

4 Jan, 2020 14:42 IST|Sakshi
ఫైల్‌ ఫోటో

జైపూర్‌ : ఢిల్లీ నుంచి ఆరుగురు వైద్యుల బృందం శనివారం రాజస్తాన్‌కు చేరుకున్నారు. రాష్ట్రంలోని కోటా జిల్లాలోని జేకేలోన్‌ పిల్లల ప్రభుత్వ ఆసుపత్రిలో వరుసగా శిశువులు మరణిస్తున్న నేపథ్యంలో ప్రస్తుత పరిస్థితిని పరిశీలించడానికి ఢిల్లీ ఎయిమ్స్‌లోని ఆరుగురు డాక్టర్లు ఆసుపత్రిని సందర్శించారు. గత డిసెంబర్‌ నెలలో 107 మంది శిశువులు మృత్యువాత పడగా కేవలం 23, 24 తేదీల్లో వంద మంది పిల్లలు జన్మిస్తే ..వారిలో పది మంది మరణించడం గమనార్హం. ఆసుపత్రిలో కనీస సౌకర్యాలు లేకపోవడం, వైద్య పరికరాల కొరత వల్లే ​​ వీరంతా మరణించినట్లు అధికారులు ధృవీకరించారు. ఈ ఘటనపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తడంతో కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ విచారణకు ఆదేశించింది. అదే విధంగా కోటా నియోజక వర్గం నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్నలోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా ఆసుపత్రిని సందర్శించి.. మృత శిశువుల తల్లిదండ్రులను పరామర్శించారు. బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఆసుపత్రిలో సౌకర్యాలను మెరుగు పరచడానికి తగు చర్యలు తీసుకోవాల్సిందిగా రాష్ట్ర ముఖ్యమంత్రికి రెండు సార్లు లేఖ రాసినట్లు ఆయన తెలిపారు.

ఇక శిశువుల మరణాల విషయాన్ని సుమోటోగా స్వీకరించిన జాతీయ మానవ హక్కుల కమిషన్‌ రాష్ట్ర ముఖ్య కార్యదర్శికి నోటీసులు జారీ చేసింది. శిశువుల మరణాలను సంబంధించి నాలుగు వారాల్లో పూర్తి నివేదిక ఇవ్వాలని నోటీసులో పేర్కొంది. కేంద్ర కమిషన్‌ సైతం ఆసుపత్రులలో ఇలాంటి ఘటనలు భవిష్యత్తులో పునరావృతం కాకుండా చూసుకోవాలని ప్రధాన కార్యదర్శిని ఆదేశించింది. ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన వైద్య పరికరాల్లో 50 శాతానికి పైగా పనికిరానివని, ఇంటెన్సివ్ కేర్‌లో ఉన్న ఆక్సీజన్‌ సరఫరాతో సహా  ప్రాథమిక సదుపాయాలు లేవని కమిషన్‌ నివేదిక ఇచ్చింది.

మరోవైపు... గతేడాదితో పోలిస్తే మరణాల సంఖ్య తక్కువగా ఉందని రాష్ట్ర అధికారులు పేర్కొన్నారు. వారు తెలిపిన వివరాల ప్రకారం 2019 సంవత్సరంలో 963 మంది పిల్లలు జెకెలోన్ ప్రభుత్వ ఆసుపత్రిలో మరణించగా, అంతకుముందు ఈ సంఖ్య 1,000 కంటే ఎక్కువగా ఉందని తేలింది. ఇదిలావుండగా ఆసుపత్రిలోని శిశువులు మరణానికి కారణమైన బాధ్యులపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని కాంగ్రెస్ నేత హరీష్ రావత్ శనివారం అన్నారు. ముఖ్యమంత్రి అశోక్ గెహ్లత్‌ అన్ని చర్యలు తీసుకుంటున్నారన్నారు. గత ఐదేళ్లుగా బీజేపీ రాష్ట్రంలోని వైద్య సదుపాయాలను నాశనం చేసిందని, ఇప్పుడు తమ పార్టీ దాన్ని వాటిని మెరుగుపరుస్తోందని రావత్‌ పేర్కొన్నారు.

>
మరిన్ని వార్తలు