‘కరోనా’ ప్యాకేజీ 15 వేల కోట్లు

10 Apr, 2020 04:46 IST|Sakshi
ఘజియాబాద్‌లోని హాట్‌స్పాట్‌ ప్రాంతమైన నంద్‌గ్రామ్‌లో పహారా కాస్తున్న పోలీసులు

కేంద్ర ప్రభుత్వం ఆమోదం

నాలుగేళ్లలో మూడు దశల్లో ప్రాజెక్టు అమలు 

తొలి దశ కింద అతి త్వరలో రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు రూ.7,774 కోట్లు

న్యూఢిల్లీ: కరోనా మహమ్మారిపై పోరాటంలో భాగంగా దేశవ్యాప్తంగా ఆరోగ్య వ్యవస్థను పూర్తిస్థాయిలో బలోపేతం చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ‘భారత్‌ కోవిడ్‌–19 అత్యవసర ప్రతిస్పందన, ఆరోగ్య వ్యవస్థ సన్నద్ధత’ ప్యాకేజీకి గురువారం ఆమోదం తెలిపింది. ఈ ప్యాకేజీలో భాగంగా కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు దశల వారీగా మొత్తం రూ.15,000 కోట్లు అందజేయనుంది. వచ్చే నాలుగేళ్లలో మూడు దశల్లో ఈ ప్రాజెక్టును అమలు చేయనున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. ఈ మేరకు అన్ని రాష్ట్రాల ఆరోగ్య శాఖల ముఖ్య కార్యదర్శులు, కమిషనర్లకు లేఖ రాసింది.  
 
మొదటి దశ కింద రూ.7,774 కోట్లు  
2020 జనవరి నుంచి జూన్‌ వరకు మొదటి దశ, 2021 జూలై నుంచి మార్చి వరకు రెండో దశ, 2021 ఏప్రిల్‌ నుంచి 2024 మార్చి వరకు మూడో దశ అమలవుతుంది. మొదటి దశ అమలు కోసం కేంద్రం అతి త్వరలో అన్ని రాష్ట్రాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు రూ.7,774 కోట్లు విడుదల చేయనుంది. తొలి దశ కింద ఇచ్చే నిధులను కరోనా బాధితులకు చికిత్స అందించేందుకు ఖర్చు చేయాలని కేంద్ర ఆరోగ్య శాఖ సూచించింది. ప్రత్యేక ఆసుపత్రులు, ఐసోలేషన్‌ యూనిట్లు ఏర్పాటు చేయాలి. వెంటిలేటర్లతో కూడిన ఐసీయూలు నెలకొల్పాలి. ల్యాబ్‌ల్లో అదనపు సౌకర్యాలు కల్పించాలి.

అదనంగా ఉద్యోగులను నియమించుకోవాలి. ఔషధాలు, వ్యక్తిగత రక్షణ పరికరాలు(పీపీఈ), ఎన్‌–95 మాస్కులు, వెంటిలేటర్ల కొనుగోలుకు ఈ నిధులను ఉపయోగించుకోవచ్చు. ఆసుపత్రులు, ప్రభుత్వ కార్యాలయాలు, ప్రజోపయోగ స్థలాలు, అంబులెన్స్‌లను శుద్ధి చేయడానికి కూడా వెచ్చించవచ్చు.  కరోనా కేసుల తీవ్రత రోజురోజుకూ పెరిగిపోతుండడం ఆందోళన కలిగిస్తోంది. కరోనా నిర్ధారణ  పరీక్షలు చేయడం, బాధితులకు వైద్య సేవలందించడం రాష్ట్ర ప్రభుత్వాలకు తలకు మించిన భారంగా మారింది. ఈ నేపథ్యంలో కరోనాపై పోరాటానికి ఆర్థిక ప్యాకేజీ ప్రకటించాలని రాష్ట్ర ప్రభుత్వాలు కోరడంతో కేంద్రం సుముఖత వ్యక్తం చేసింది.  ‘భారత్‌ కోవిడ్‌–19 అత్యవసర ప్రతిస్పందన, ఆరోగ్య వ్యవస్థ సన్నద్ధత’ ప్యాకేజీకి తాజాగా ఆమోదం తెలిపింది.   

మరో 20 మరణాలు
ఒక్క రోజులో 591 పాజిటివ్‌లు
న్యూఢిల్లీ: కరోనా వైరస్‌ పంజా విసురుతూనే ఉంది. దేశవ్యాప్తంగా బుధవారం నుంచి గురువారం వరకు.. ఒక్కరోజులో 591 కొత్త కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. 20 మంది మృతి చెందారు. మహారాష్ట్రలో 8 మంది, గుజరాత్‌లో ముగ్గురు, మధ్యప్రదేశ్‌లో ముగ్గురు, జమ్మూకశ్మీర్‌లో ఇద్దరు, పంజాబ్, ఉత్తరప్రదేశ్, కర్ణాటక, తమిళనాడులో ఒక్కొక్కరు చొప్పున కన్నుమూశారు. దీంతో దేశంలో మొత్తం మృతుల సంఖ్య 169కు చేరిందని, ఇప్పటిదాకా 5,865 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్‌ అగర్వాల్‌ గురువారం మీడియా సమవేశంలో ప్రకటించారు. కరోనా నిర్ధారణ పరీక్షల్లో భాగంగా ఇప్పటిదాకా 1,30,000 నమూనాలను పరీక్షించినట్లు భారత వైద్య పరిశోధనా మండలి(ఐసీఎంఆర్‌) వెల్లడించింది. రాష్ట్ర ప్రభుత్వాల గణాంకాల ప్రకారం కరోనాతో దేశవ్యాప్తంగా 196 మంది మృతి చెందగా, పాజిటివ్‌ కేసులు  6,500కు చేరాయి. కరోనా వ్యాప్తి నానాటికీ పెరుగుతుండడంతో రాష్ట్రాలు అప్రమత్తమయ్యాయి. నిఘాను తీవ్రతరం చేశాయి.

పీపీఈల లభ్యతపై ఆందోళన వద్దు
కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో వ్యక్తిగత రక్షణ పరికరాల(పీపీఈ) లభ్యతపై ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని లవ్‌ అగర్వాల్‌ స్పష్టం చేశారు. ఈ విషయంలో వదంతులను నమ్మొద్దని కోరారు. ప్రస్తుతం సరిపడా పరికరాలు అందుబాటులో ఉన్నాయని, వాటిని అవసరం మేరకు పొదుపుగా వాడుకోవాలని సూచించారు. దేశంలో 20 సంస్థలు పీపీఈలను తయారు చేస్తున్నాయని, 1.7 కోట్ల పరికరాలు సరఫరా చేయాలంటూ ఆయా సంస్థలకు ఆర్డర్‌ ఇచ్చామని తెలిపారు. 49,000 వెంటిలేటర్లు త్వరలో అందనున్నాయని చెప్పారు. కరోనా బాధితుల కోసం 10 వైద్య బృందాలను 9 రాష్ట్రాలకు పంపించామని పేర్కొన్నారు. రైల్వే శాఖ 3,250 కోచ్‌లను ఐసోలేషన్‌ యూనిట్లుగా మార్చిందన్నారు.  రైల్వే శాఖ 6 లక్షల ఫేస్‌ మాస్కులను ఉత్పత్తి చేసిందని, వీటిని మళ్లీ మళ్లీ ఉపయోగించుకోవచ్చని, అలాగే 4,000 లీటర్ల శానిటైజర్‌ను తయారు చేసిందని  తెలిపారు.

‘ఆరోగ్య సేతు’ను డౌన్‌లోడ్‌ చేసుకోండి: మోదీ
న్యూఢిల్లీ: కరోనా వైరస్‌పై పోరులో ఎంతో ఉపయుక్తంగా ఉండే ఆరోగ్యసేతు యాప్‌ను మొబైల్‌లలో డౌన్‌లోడ్‌ చేసుకోవాలని ప్రధాని మోదీ ప్రజలను కోరారు. ‘కోవిడ్‌ను చూసి భయపడితే ఎలాంటి లాభం ఉండదు. జాగ్రత్తలు కూడా తీసుకోవాలి. ఈ దిశగా కీలకమైన మొదటి అడుగు ఆరోగ్య సేతు. ఇది మీ చుట్టూ కోవిడ్‌ వైరస్‌ బాధితులెవరైనా ఉంటే కనిపెడుతుంది. అన్ని రాష్ట్రాల్లోని హెల్ప్‌డెస్క్‌ల ఫోన్‌ నంబర్లు ఇందులో ఉన్నాయి’అని ట్విట్టర్‌లో తెలిపారు.

మరిన్ని వార్తలు