పేదలందరికీ ‘ఉజ్వల’ వంట గ్యాస్‌ కనెక్షన్లు

18 Dec, 2018 04:06 IST|Sakshi

న్యూఢిల్లీ: ఉజ్వల యోజనలో భాగంగా వంటగ్యాస్‌ కనెక్షన్లను పేదలందరికీ ఉచితంగా ఇవ్వాలని కేంద్రం నిర్ణయించింది. 2016లో ప్రారంభించిన ఈ పథకాన్ని తొలుత గ్రామీణ ప్రాంతాల్లోని దారిద్య్రరేఖ దిగువన ఉన్న కుటుంబాలకు ఉద్దేశించారు. అనంతరం దీనిని ఎస్సీ, ఎస్టీలకు, అటవీ ప్రాంతాల్లో నివసించే వారికి విస్తరించారు. ఇకపై దేశవ్యాప్తంగా ఉన్న నిరుపేదలందరికీ ఈ పథకాన్ని వర్తింపజేయాలని మంత్రివర్గం నిర్ణయించిందని చమురు శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ వెల్లడించారు. వంటగ్యాస్‌ కనెక్షన్‌ లేని, ప్రభుత్వ పథకాల లబ్దిదారులు కాని వారికి ప్రధానమంత్రి ఉజ్వల యోజన వర్తింపజేయాలని ఆర్థిక వ్యవహారాల కేబినెట్‌ కమిటీ సోమవారం నిర్ణయించిందని ఆయన వివరించారు. 50 శాతానికి పైగా(కనీసం 20 వేలు) గిరిజన జనాభా ఉన్న బ్లాకుల్లో ఏకలవ్య రెసిడెన్షియల్‌ మోడల్‌ పాఠశాలల్ని ప్రారంభించాలని కేబినెట్‌ నిర్ణయించింది. ఇందుకు  రూ.2,242 కోట్లు వెచ్చించాలని నిర్ణయించింది.

మరిన్ని వార్తలు