వైవాహిక అత్యాచారం నేరం కాదు

30 Aug, 2017 01:34 IST|Sakshi
వైవాహిక అత్యాచారం నేరం కాదు

ఢిల్లీ హైకోర్టులో కేంద్రం అఫిడవిట్‌
న్యూఢిల్లీ:
భార్య అంగీకారం లేకుండా భర్త ఆమెతో శృంగారంలో పాల్గొనడాన్ని నేరంగా పరిగణించలేమని, అలా చేస్తే వివాహ వ్యవస్థ అస్థిరమవుతుందని ఢిల్లీ హైకోర్టుకు కేంద్రం తెలిపింది. భర్తలను వేధింపులకు గురిచేయడానికి భార్యలకు అది ఒక సులభమైన ఆయుధంగా మారే ప్రమాదముందని ఆందోళన వ్యక్తం చేసింది. వైవాహిక అత్యాచారాన్ని (మారిటల్‌ రేప్‌)ను నేరంగా చూడాలని కోరుతూ దాఖలైన పిటిషన్లకు స్పందనగా కేంద్రం మంగళవారం అఫిడవిట్‌ సమర్పించింది.

ఐపీసీ సెక్షన్‌ 498 ఏ (గృహ హింస వ్యతిరేక చట్టం) దుర్వినియోగమవుతున్న సంగతి సుప్రీంకోర్టు, పలు హైకోర్టుల దృష్టికి వచ్చిందని గుర్తుచేసింది. ఈ విషయంలో ఎలాంటి సంక్లిష్టతలకు తావివ్వకుండా ఉండాలంటే రాష్ట్ర ప్రభుత్వాలను కూడా ప్రతివాదులుగా చేర్చి వాటి అభిప్రాయాలు తెలుసుకోవాలది. వైవాహిక రేప్‌ను చట్టం లో నిర్వచించలేదని, అందుకోసం సమాజంలో విస్తృత ఏకాభిప్రాయం అవసరమవుతుందని తెలిపింది.

నైతిక అవగాహన ముఖ్యం:
‘భార్యకు వైవాహిక అత్యాచారంగా కనిపించినది ఇతరులకు అలా కనిపించకపోవచ్చు. వైవాహిక రేప్, వైవాహికేతర రేప్‌ మధ్య తేడాను స్పష్టంగా నిర్వచించాలి. రేప్‌ కేసుల విచారణ నుంచి భర్తలకు ఇస్తున్న మినహాయింపు తొలగించడం ద్వారా వైవాహిక రేప్‌లు సమసిపోవు. నైతిక, సామాజిక అవగాహన ఇక్కడ చాలా ముఖ్యం. భర్త తనపై చేసింది రేపా? కాదా? అని తేల్చే బాధ్యత భార్యపైనే ఉంటుంది. భార్య, భర్తల మధ్య జరిగిన శృంగారానికి సంబంధించి ఎలాం టి సాక్ష్యాలు లేనప్పుడు కోర్టులు ఏ ఆధారాలను నమ్ముతాయి’ అని కేంద్రం ప్రశ్నించింది. అవివాహితురాలి మాదిరిగానే వివా హితురాలికీ తన శరీరంపై హక్కు ఉంటుం దని పిటిషనర్ల న్యాయవాది  వాదించారు.

మరిన్ని వార్తలు