ఆర్‌టీఐ కమిషనర్ల పదవి మూడేళ్లే!

26 Oct, 2019 04:14 IST|Sakshi

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా సమాచార హక్కు కమిషనర్ల పదవీకాలాన్ని మూడేళ్లకు కుదించే ప్రతిపాదన సహా.. సమాచార హక్కు చట్టం నూతన నిబంధనలకు కేంద్రం శుక్రవారం ఆమోదం తెలిపింది. ఇకపై అన్ని నియామకాలకు కొత్త నిబంధనలు వర్తిస్తాయి.  వేతనం, ఇతర అలవెన్సులు, సర్వీసు నిబంధనల విషయంలో నిర్ణయాధికారం కొత్త నిబంధనల ద్వారా కేంద్ర ప్రభుత్వానికి లభించింది. ఆయా నిబంధనలను మార్చే అధికారం కూడా ఇకపై కేంద్రానికి ఉండనుంది.

2005 చట్టంలో సమాచార హక్కు కమిషనర్ల పదవీ కాలాన్ని కచ్చితంగా ఐదేళ్లు లేదా 65 ఏళ్ల వయసు వచ్చేవరకు అని నిర్ణయించగా, తాజా నిబంధనల్లో దాన్ని మూడేళ్లకు కుదించారు. ప్రధాన సమాచార కమిషనర్‌ వేతనాన్ని రూ. 2.5 లక్షలుగా, సమాచార కమిషనర్‌ వేతనాన్ని రూ. 2.25 లక్షలుగా నిర్ణయించారు. ఈ మార్పులు సమాచార హక్కు చట్టం స్ఫూర్తిని కాలరాయడమేనని, తాజా నిబంధనల వల్ల సమాచార కమిషన్లు ప్రభుత్వ విభాగాల స్థాయికి తగ్గిపోతాయని ఉద్యమకారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

మరిన్ని వార్తలు