ఉరి.. అందరికీ ఒకే సారి

6 Feb, 2020 03:49 IST|Sakshi

నిర్భయ కేసులో ఢిల్లీ హైకోర్టు స్పష్టీకరణ

దోషులకు ఏడు రోజుల గడువు

సుప్రీంను ఆశ్రయించిన కేంద్రం, ఢిల్లీ ప్రభుత్వం

న్యూఢిల్లీ: నిర్భయపై సామూహిక హత్యాచార కేసులో మరణశిక్ష పడిన నలుగురు దోషులు తమకున్న అన్ని న్యాయపర అవకాశాలను వినియోగించుకోవడానికి ఢిల్లీ హైకోర్టు వారం రోజుల గడువు విధించింది. వారం తర్వాత అధికారులు చట్టబద్ధంగా వ్యవహరించాలని ఆదేశిస్తూ ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ సురేష్‌ బుధవారం చెప్పారు. దోషులను విడివిడిగా కాకుండా అందరికీ ఒకేసారి శిక్ష అమలుచేయాలని హైకోర్టు తేల్చి చెప్పింది.

కేంద్రం పిటిషన్‌ కొట్టివేత..
నిర్భయ దోషులకు విధించిన మరణశిక్ష అమలులో ఆలస్యాన్ని సవాల్‌ చేస్తూ కేంద్రం ఢిల్లీ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన జడ్జి తాజా ఆదేశాలిచ్చారు. న్యాయపరమైన అన్ని అవకాశాలనూ వినియోగించుకున్న కారణంగా నలుగురు దోషుల్లో ఇద్దరు ముఖేష్‌ సింగ్, వినయ్‌ శర్మలను వేరుగా ఉరితీయాలంటూ చేసిన కేంద్రం అభ్యర్థనను కోర్టు కొట్టివేసింది. తీహార్‌ జైలు నిబంధనలను కోర్టు తప్పుగా అర్థం చేసుకున్నదనీ, ఉరిశిక్ష నుంచి తప్పించుకోవడానికి దోషులు యత్నిస్తున్నారంటూ ప్రభుత్వం తరఫున వాదించిన సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా వ్యాఖ్యలను కోర్టు తోసిపుచ్చింది.

దోషులు పెట్టుకున్న  క్షమాభిక్ష అర్జీని అప్పీల్‌గా పరిగణించరాదన్న తుషార్‌ వ్యాఖ్యలను జడ్జి అంగీకరించలేదు. దోషులందరి డెత్‌ వారెంట్లనూ ఒకేసారి అమలుచేయాలని తాను అభిప్రాయపడుతున్నానని పేర్కొన్నారు. కేంద్రం అభ్యర్థనమేరకు ఆదివారం ప్రత్యేకంగా విచారించిన జస్టిస్‌ సురేష్‌ కుమార్‌ రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 21 కల్పించిన అన్ని రక్షణలను దోషులు చివరి శ్వాస వరకు వినియోగించుకుంటారని స్పష్టం చేశారు. ముకేష్‌ సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్‌ ని దాఖలు చేసే వరకూ అంటే 186 రోజులపాటు దోషుల ఉరితీతపై ఎవ్వరికీ పట్టలేదనడంలో తనకు సందేహం లేదని జడ్జి తేల్చి చెప్పారు.

మరిన్ని వార్తలు