కశ్మీర్‌కు పదివేల బలగాలు

28 Jul, 2019 04:37 IST|Sakshi

తక్షణం తరలించాలని కేంద్రం ఆదేశాలు

న్యూఢిల్లీ/కశ్మీర్‌: కశ్మీర్‌ లోయకు పదివేల మంది భద్రతా బలగాలను తక్షణం తరలించాలని కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రంలో ఉగ్రవాదుల కార్యకలాపాలకు అడ్డుకట్టవేసేందుకు, శాంతి భద్రతల విధి నిర్వహణకు వీరిని పంపుతున్నట్లు ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. 100 కంపెనీల కేంద్ర సాయుధ పోలీసు దళాల (సీఏపీఎఫ్‌)ను తక్షణం తరలించాలని కేంద్ర హోం శాఖ ఈనెల 25వ తేదీన ఉత్తర్వులు వెలువరించిందని పేర్కొన్నారు. రాష్ట్రానికి మరికొన్ని బలగాలను కూడా తరలించే యోచనలో కేంద్రం ఉందని కూడా వెల్లడించారు. ఒక సీఏపీఎఫ్‌ కంపెనీలో 100 మంది సిబ్బంది ఉంటారు.

కశ్మీర్‌ లోయకు పంపే వారిలో సీఆర్‌పీఎఫ్‌కు చెందిన 50 కంపెనీలు, సశస్త్ర సీమా బల్‌(ఎస్‌ఎస్‌బీ) నుంచి 30, ఐటీబీపీ, బీఎస్‌ఎఫ్‌ నుంచి పదేసి కంపెనీల చొప్పున బలగాలు ఉంటాయన్నారు. వీరందరినీ రైళ్లు, విమానాల్లో విధులు చేపట్టే ప్రాంతాలకు తరలిస్తామని పేర్కొన్నారు. ఇప్పటికే ఉగ్ర నిరోధక చర్యలతోపాటు అమర్‌నాథ్‌ యాత్రకు బందోబస్తు కల్పిస్తున్న 80 బెటాలియన్ల బలగాలకు వీరు అదనమన్నారు. ఒక్కో బెటాలియన్‌లో వెయ్యి మంది సిబ్బంది ఉంటారు. రాష్ట్రపతి పాలనలో ఉన్న జమ్మూకశ్మీర్‌లో ఎన్నికలు జరపాలని యోచిస్తున్న నేపథ్యంలోనే కేంద్రం ఈ బలగాలను మోహరిస్తోందని భావి స్తున్నారు. బలగాలను తరలించాలన్న కేం ద్రం నిర్ణయాన్ని పీడీపీ అధినేత్రి, మాజీ సీఎం మెహబూబా ముఫ్తీ తప్పుపట్టారు.

జైషే టాప్‌ కమాండర్‌ హతం  
శ్రీనగర్‌: జమ్మూ కశ్మీర్‌లోని సోపియాన్‌ జిల్లాలో భద్రతా దళాలతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో పాకిస్తాన్‌ అగ్రశ్రేణి జైషే మహమ్మద్‌ (జేఎం)కు చెందిన కమాండర్‌ మున్నా లాహోరిని భద్రతా దళాలు మట్టుబెట్టాయి. శుక్రవారం రాత్రి సోపియాన్‌లోని బోన్‌బజార్‌ ప్రాంతం బండే మొహల్లాలో ఉగ్రవాదులు ఉన్నారన్న సమాచారం మేరకు భద్రతా దళాలు గాలింపు చర్యలు ప్రారంభించాయి. దీంతో ఉగ్రవాదులు కాల్పులు ప్రారంభించడంతో ఎన్‌కౌంటర్‌ చోటుచేసుకుంది. గత నెలలో ఇద్దరు ఆర్మీ జవాన్లు ప్రాణాలు కోల్పోయిన కారు పేలు డుకు లాహోరి కారణమని పోలీసులు తెలి పారు. పాక్‌ జాతీయుడైన మున్నా లాహోరి కశ్మీర్‌లో వరుస పౌర హత్యలకు పాల్పడ్డా డని తెలిపారు. కశ్మీర్‌లో ఉగ్రవాదుల నియా మకం కోసం లాహోరిని జైషే  నియమిం చిందని, అతడు పేలుడు పరికరాల తయా రీలో సిద్ధహస్తుడని పోలీసులు తెలిపారు.

మరిన్ని వార్తలు