రంజాన్‌లో మిలటరీ ఆపరేషన్లు నిలిపివేత

17 May, 2018 04:12 IST|Sakshi

న్యూఢిల్లీ/శ్రీనగర్‌: పవిత్ర రంజాన్‌ మాసంలో జమ్మూకశ్మీర్‌లో మిలటరీ ఆపరేషన్లను నిలిపివేయాలని భద్రతాబలగాలను కేంద్రం ఆదేశించింది. రంజాన్‌ను ముస్లింలు ప్రశాంత వాతావరణంలో జరుపుకునేందుకు వీలుగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు హోంశాఖ అధికార ప్రతినిధి ఒకరు తెలిపారు. ఒకవేళ భద్రతాబలగాలపై దాడి జరిగితే తిప్పికొట్టేందుకు, ప్రజల్ని రక్షించే పూర్తి స్వేచ్ఛ బలగాలకు ఉందని స్పష్టం చేశారు. ఈ మేరకు కేంద్రం నిర్ణయాన్ని హోంమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ జమ్మూకశ్మీర్‌ సీఎం మెహబూబా ముఫ్తీకి తెలియజేసినట్లు పేర్కొన్నారు. అర్థంలేని హింసతో ఇస్లాంకు చెడ్డపేరు తీసుకొస్తున్న ఉగ్రమూకలను ఏకాకి చేయాల్సిన అవసరం ఉందన్నారు. రంజాన్‌ను ముస్లింలు ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రశాంతంగా జరుపుకునేందుకు ప్రతిఒక్కరూ సహకరించాలని కోరారు. ప్రధాని మోదీ శనివారం కశ్మీర్‌లో పర్యటించనున్న వేళ కేంద్రం ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం.

మరిన్ని వార్తలు