ఆధార్‌ లింక్‌ గడువు మార్చి 31

26 Oct, 2017 04:32 IST|Sakshi

న్యూఢిల్లీ: వివిధ పథకాల ద్వారా లబ్ధిపొందడానికి ఆధార్‌ తప్పనిసరి చేస్తూ ఇచ్చిన గడువును 2018, మార్చి 31వ వరకు పొడిగించినట్లు కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలిపింది. 2017, డిసెంబర్‌ 31 వరకు ఉన్న ఈ గడువును మరో మూడు నెలలు పెంచుతున్నట్లు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ దీపక్‌ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనానికి బుధవారం వివరించింది. ఈ ధర్మాసనంలో జస్టిస్‌ ఎంకే ఖన్విల్కర్, జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ సభ్యులుగా ఉన్నారు. ప్రభుత్వ సేవలు పొందడానికి ఆధార్‌ తప్పనిసరి అన్న కేంద్రం ప్రకటనను సవాల్‌చేస్తూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీం విచారింది. కేంద్రం గడువు పొడిగిస్తూ పోతున్నది తప్ప.. అసలు ఆధార్‌ లింక్‌ చేసుకోబోమంటున్న వారి పరిస్థితి గురించి వివరణ ఇవ్వడం లేదని పిటిషనర్ల తరఫున న్యాయవాది కోర్టు దృష్టికి తెచ్చారు. దీనిపై కేంద్రం స్పందనను అక్టోబర్‌ 30లోగా తెలియజేయాలని అటార్నీ జనరల్‌ను ధర్మాసనం ఆదేశించింది.  

>
మరిన్ని వార్తలు