లోక్‌పాల్‌ ఎంపిక కమిటీ నియామకం

28 Sep, 2018 05:43 IST|Sakshi

న్యూఢిల్లీ: అవినీతి నిరోధం కోసం నియమించనున్న లోక్‌పాల్‌కు చైర్‌పర్సన్, ఇతర సభ్యులను ఎంపిక చేసేందుకు ఓ కమిటీని ప్రతిపక్ష కాంగ్రెస్‌ ప్రమేయం లేకుండానే కేంద్ర ప్రభుత్వం గురువారం నియమించింది. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ రంజనా ప్రకాశ్‌ దేశాయ్‌ నేతృత్వంలోని ఎనిమిది మంది సభ్యుల ఈ కమిటీ లోక్‌పాల్‌ చైర్‌పర్సన్, సభ్యులను ఎంపిక చేస్తుంది. భారతీయ స్టేట్‌ బ్యాంక్‌ మాజీ చైర్‌వుమన్‌ అరుంధతీ భట్టాచార్య, ప్రసార భారతి చైర్మన్‌ సూర్య ప్రకాశ్, ఇస్రో మాజీ చైర్మన్‌ కిరణ్‌ కుమార్, అలహాబాద్‌ హైకోర్టు మాజీ జడ్జి జస్టిస్‌ సఖ రామ్‌ సింగ్‌ యాదవ్, గుజరాత్‌ మాజీ డీజీపీ షబ్బీర్‌ హుస్సేన్‌ ఖండ్వావాల, రాజస్తాన్‌ కేడర్‌కు చెందిన విశ్రాంత ఐఏఎస్‌ అధికారి లలిత్‌ పన్వార్, మాజీ సొలిసిటర్‌ జనరల్‌ రంజిత్‌ కుమార్‌లు ఈ ఎంపిక కమిటీలో సభ్యులుగా ఉంటారని సిబ్బంది మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. ‘లోక్‌పాల్‌ చట్టంలో ఉన్న నిబంధనలను అనుసరించి లోక్‌పాల్‌ ఎంపిక జరుగుతోంది’ అని సిబ్బంది శాఖ సహాయ మంత్రి జితేంద్ర సింగ్‌ చెప్పారు. అయితే లోక్‌సభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున్‌ ఖర్గే లేకుండానే ఈ ఎనిమిది మంది కమిటీని కేంద్రం నియమించింది.

మరిన్ని వార్తలు