కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కరోనా కాటు

23 Apr, 2020 13:52 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: కరోనా కష్టం కాలంలో కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు షాక్ ఇచ్చింది  కోవిడ్-19 సంక్షోభంతో ఆర్థిక వ్యవస్థపై భారం పెరిగిన నేపథ్యంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఉద్యోగులకు డీఏ (డియర్నెస్ అలవెన్స్) చెల్లింపులను నిలిపివేసింది. 4 శాతం నుంచి 12 శాతానికి పెంచుతూ మార్చి13 నాటి కేంద్ర కేబినెట్  నిర్ణయం అమలును నిలిపివేసింది. తద్వారా కేంద్ర ఖజానాపై 2020-21 ఆర్థిక సంవత్సరానికి గానూ సుమారు 27,000 కోట్ల రూపాయలు భారాన్ని తగ్గించుకోనుంది. 2020 జనవరి 1 నుంచి  జూన్ వరకు ఇది వర్తిస్తుందని ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది. ఈ నిర్ణయంతో సుమారు 49.26 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, 61.17 లక్షల మంది పెన్షనర్లను ప్రభావితం చేస్తుంది. పెరుగుతున్నధరల కనుగుణంగా దీన్ని సంవత్సరానికి రెండుసార్లు సవరిస్తారు. తదుపరి సమీక్ష  జూలైలో ఉండనుంది 

కరోనా సంక్షోభం, మార్చి 24 నుంచి లాక్‌డౌన్ అమలవుతున్న కారణంగా పన్నుల నుండి వచ్చే ఆదాయం తగ్గిపోయింది. ఉత్పత్తుల ఖర్చులు పెరిగాయి. నిధుల కొరత నేపధ్యంలో ప్రభుత్వం ఎక్కువగా ఖర్చులను తగ్గించుకుంటోంది. అన్ని శాఖలకు కేటాయించిన బడ్జెట్‌లో 40 శాతం కోత విధిస్తూ నిర్ణయం తీసుకుంది. ప్రధాన మంత్రి, మంత్రులు, అధ్యక్షుడు, పార్లమెంటు సభ్యుల జీతాలను ప్రభుత్వం ఇప్పటికే 30 శాతం తగ్గించింది. ఎంపీ లాడ్స్ నిధులను కూడా రెండు సంవత్సరాలు నిలిపివేసింది. దీంతోపాటు కరోనా బాధితులను, నష్టపోయిన ప్రజానీకాన్ని ఆదుకునేందుకుగాను కేంద్ర ప్రభుత్వోద్యోగుల (రెవెన్యూ శాఖ) ఒక రోజు వేతనాన్ని కోత విధించి ఈ నిధులను పీఎం కేర్స్‌ జాతీయనిధికి జమ చేయాలని కేంద్రం నిర్ణయించింది. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాలు  తమ ఉద్యోగుల జీతాలను తగ్గించిన సంగతి తెలిసిందే. (ఆసియాలో అపర కుబేరుడుగా అంబానీ)

చదవండి : చెల్లింపుల జోష్ : వొడాఫోన్ ఐడియా జంప్
కరోనా కల్లోలం : జీడీపీపై ఫిచ్ షాకింగ్ అంచనాలు

మరిన్ని వార్తలు