వీధి వ్యాపారులకు రూ. 10 వేలు

2 Jun, 2020 06:38 IST|Sakshi

ప్రత్యేక సూక్ష్మ రుణ పథకం ఆవిష్కరణ

న్యూఢిల్లీ: కరోనా కారణంగా ఉపాధి కోల్పోయి తీవ్ర ఇబ్బందులు పడుతున్న వీధి వ్యాపారుల కోసం కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక సూక్ష్మ రుణ పథకాన్ని సోమవారం ఆవిష్కరించింది. దీని ద్వారా వారికి రూ. 10 వేల వరకు రుణం అందించనున్నారు. ఈ ‘ప్రధానమంత్రి స్ట్రీట్‌ వెండర్స్‌ ఆత్మ నిర్భర్‌ నిధి’ పథకం సుమారు 50 లక్షల మందికి లబ్ధి చేకూర్చనుందని కేంద్ర పట్టణ గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ సంవత్సరం మార్చి 22 వరకు వీధి వ్యాపారాల్లో ఉన్నవారు ఈ పథకానికి అర్హులని పేర్కొంది. ‘వారు రూ. 10 వేల వరకు రుణం తీసుకోవచ్చు. ఆ రుణాన్ని సులభ నెలవారీ వాయిదాల్లో సంవత్సరంలోపు చెల్లించాలి.

సమయానికి కానీ, ముందుగా కానీ చెల్లించినవారికి వార్షిక వడ్డీలో 7% వరకు రాయితీ లభిస్తుంది. ఆ రాయితీ మొత్తం ఆరు నెలలకు ఒకసారి వారి బ్యాంక్‌ ఖాతాలో జమ అవుతుంది. ఈ పథకం మార్చి 2022 వరకు అమల్లో ఉంటుంది. సమయానికి రుణ వాయిదాలు చెల్లించినవారికి రుణ పరిమితిని పెంచే అవకాశం కూడా ఉంది’ అని వివరించింది. ఈ పథకం అమలులో స్థానిక సంస్థలు కీలక పాత్ర పోషించాలని, వీధి వ్యాపారులు, బ్యాంకులు, ఇతర ఫైనాన్స్‌ సంస్థల మధ్య అనుసంధానకర్తలుగా వ్యవహరించాలని కోరింది. పథకం అమలు కోసం మొబైల్‌ యాప్‌ను, వెబ్‌ పోర్టల్‌ను రూపొందిస్తున్నామని వెల్లడించింది. కేబినెట్‌ తీసుకున్న నిర్ణయాలు రైతులు, కూలీలు, శ్రామికుల జీవితాల్లో సానుకూల మార్పులను తీసుకువస్తాయని మోదీ పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు