కరోనా : ఈ వాట్సాప్‌ నంబరు సేవ్‌ చేసుకోండి!

20 Mar, 2020 19:55 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: కరోనా వైరస్‌ దేశంలో విజృంభిస్తున్న తరుణంలో కేంద్రం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ముఖ్యంగా ప్రజలకు ఈ వైరస్‌పై అవగాహన కల్పించే  చర్యల్లో భాగంగా ప్రముఖ ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్‌ వాట్సాప్‌లో అధికారిక వాట్సాప్‌ చాట్‌బాట్‌ను ప్రారంభించింది. వాట్సాప్‌లో తప్పుడు సమాచారం,  నకిలీ వార్తలకు చెక్‌  పెట్టే లక్ష్యంతో మై గోవ్ కరోనా హెల్ప్‌డెస్క్ (MyGov Corona Helpdesk) పేరుతో దీన్ని లాంచ్‌ చేసింది. ఇది వినియోగదారులందరికీ అందుబాటులో ఉంటుంది. ఫేస్‌బుక్, ఇతర సోషల్‌మీడియా ప్లాట్‌ఫామ్‌లపై ఫేక్ న్యూస్‌ను గుర్తించేందుకు, కోవిడ్‌-19 పై సమస్యలను పరిష్కరించుకోవాలని కోరుతోంది. ఇందుకోసం వాట్సాప్ నెంబర్ 9013151515ను లాంచ్‌ చేసింది. ఈ నేపథ్యంలోనే నేషనల్ ఫార్మాస్యూటికల్స్ ప్రైసింగ్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్‌పీపీఏ) ట్విటర్‌లో దీన్ని ప్రకటించింది. కరోనా వైరస్‌కు సంబంధించి అందోళన చెందవద్దనీ,  వాట్సాప్ నెంబర్‌లో  ప్రజల సందేహాలకు, ప్రశ్నలకు ఆటోమెటిక్ గా సమాధానం  లభిస్తుందని ఎన్‌పీపీఏ ట్వీట్‌ చేసింది.

ఈ వాట్సాప్ చాట్‌బాట్ కాకుండా కోవిడ్‌-19 (కరోనా వైరస్‌ జాతీయ హెల్ప్‌లైన్ నంబర్‌ను (+ 91-11-23978046, టోల్ ఫ్రీ నెంబర్‌ 1075 ను కూడా ప్రభుత్వం అందుబాటులో వుంచింది.  అలాగే పౌరుల సౌలభ్యంకోసం అధికారిక ఇమెయిల్ ఐడి (ncov2019@gov.in) ను ఏర్పాటు చేసింది. వీటి ద్వారా ప్రజలు తమ సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు. అసత్య, అసంబద్ద వ్యార్తలనుంచి దూరంగా వుండవచ్చు. 

>
మరిన్ని వార్తలు