దీదీ ధర్నాలో పాల్గొన్న అధికారులపై వేటు?

7 Feb, 2019 20:32 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : కోల్‌కతా పోలీస్‌ కమిషనర్‌ నివాసంపై సీబీఐ అధికారుల దాడులకు నిరసనగా పశ్చిమ బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ చేపట్టిన దీక్షలో పాల్గొన్న ఐదుగురు ఐపీఎస్‌ అధికారులపై కేంద్రం చర్యలు చేపట్టే అవకాశం ఉంది. ధర్నాలో పాల్గొన్న డీజీపీ వీరేంద్ర, అడిషనల్‌ డీజీపీ వినీత్‌ కుమార్‌ గోయల్‌, ఏడీజీ అనుజ్‌ శర్మ సహా ఐదుగురు ఐపీఎస్‌ అధికారులపై చర్యలు చేపట్టాలని కోరుతూ కేంద్ర హోంమంత్రిత్వ శాఖ పశ్చిమ బెంగాల్‌ ప్రభుత్వానికి లేఖ రాయనుందని హోంమంత్రిత్వ శాఖ వర్గాలు పేర్కొన్నాయి.

ప్రతిభావంతమైన సేవలు అందించినందుకు వారికి ఇచ్చిన పతకాలను వెనక్కి తీసుకోవడం, కేంద్ర సర్వీసుల్లో వారిని పనిచేయకుండా నిర్ధిష్టకాలానికి దూరం పెట్టడం వంటి చర్యలూ చేపట్టవచ్చని బావిస్తున్నారు. మరోవైపు ఐపీఎస్‌ అధికారులపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని కేం‍ద్ర ప్రభుత్వం సూచనలపై మమతా సర్కార్‌ గుర్రుగా ఉంది. కాగా మమతా ధర్నాలో తాము పాల్గొనలేదని మరికొందరు ఐపీఎస్‌ అధికారులు వివరణ ఇస్తున్నారు.

మరిన్ని వార్తలు