డేటా లేకుండా రిజర్వేషన్లు ఎలా?

4 Aug, 2018 03:28 IST|Sakshi

న్యూఢిల్లీ: ప్రభుత్వ ఉద్యోగాల్లో ఎస్సీ, ఎస్టీలకు తక్కువ ప్రాతినిధ్యం ఉందని నిరూపించే సమాచారంతో రాష్ట్రాలు ఎందుకు ముందుకు రావడంలేదని సుప్రీంకోర్టు కేంద్రాన్ని ప్రశ్నించింది. నియామకాలు, పదోన్నతుల్లో రిజర్వేషన్లు కల్పించేందుకు పరిమాణాత్మక సమాచారమే కీలకమని ఉద్ఘాటించింది. పదోన్నతుల్లో ఎస్సీ, ఎస్టీలకు క్రీమీలేయర్‌ను వర్తింపజేయాలన్న 12 ఏళ్ల నాటి కోర్టు తీర్పును కేంద్రం సవాలుచేయడం తెల్సిందే. ఆ పిటిషన్‌ను విచారిస్తూ సుప్రీం పైవిధంగా స్పందించింది. పదోన్నతుల్లో దళితులకు 23 శాతం కోటా ఉండాలని కేంద్రం ఉద్ఘాటించింది. 2006 నాటి ఎం.నాగరాజ్‌ కేసులో ఎస్సీ, ఎస్టీల పదోన్నతులకు వెనకబాటుతనం, తక్కువ ప్రాతినిధ్యాన్ని కోర్టు ప్రాదిపదికగా నిర్ధారించడం తెల్సిందే. దీంతో వారికి పదోన్నతులు దాదాపు నిలిచిపోయాయని, ఆ తీర్పును ఏడుగురు సభ్యుల బెంచ్‌ పునఃపరిశీలించాలని కేంద్రం కోరింది.

క్రీమీలేయర్‌పై 12 ఏళ్ల క్రితం వెలువడిన తీర్పు తప్పని నిరూపించాలంటే, ప్రభుత్వ ఉద్యోగాల్లో ఎస్సీ, ఎస్టీలకు అన్యాయం జరిగిందనే సమాచారాన్ని గణాంకాలతో సహా సమర్పించాలి. ఇన్నేళ్లయినా ఆ వివరాలను రాష్ట్రాలు ఇంకా ఎందుకు సేకరించలేదు?’ అని కోర్టు కేంద్రాన్ని ప్రశ్నించింది. కేంద్రం తరఫున విచారణకు హాజరైన అటార్నీ జనరల్‌ వేణుగోపాల్‌ వాదిస్తూ..వెనకబడిన తరగతులుగా భావిస్తున్న ఎస్సీ, ఎస్టీలు వెనకబడిన వాళ్లమని ప్రత్యేకంగా నిరూపించుకోవాల్సిన అవసరంలేదన్న 1992 నాటి ఇందిరా సహానీ కేసును ఉదహరించారు. పరిమాణాత్మక సమాచారం అందుబాటులో ఉంటే నియామకాల్లో రిజర్వేషన్లు కల్పించే అధికారాలు రాష్ట్రాల పరిధిలోనే ఉంటాయని కోర్టు బదులిచ్చింది. వారికి తగిన ప్రాతినిధ్యం లేదని భావిస్తే, వేగంగా పదోన్నతులు కల్పించే బాధ్యత రాష్ట్రాలదే అని పేర్కొంది.

మరిన్ని వార్తలు