నీట్ రద్దుపై రివ్యూ పిటిషన్ : కేంద్ర ప్రభుత్వం యోచన

20 Jul, 2013 06:20 IST|Sakshi
నీట్ రద్దుపై రివ్యూ పిటిషన్ : కేంద్ర ప్రభుత్వం యోచన

- సుప్రీం తీర్పుతో విద్యార్థులకు కష్టాలు: ఆజాద్

సాక్షి లీగల్ కరస్పాండెంట్, న్యూఢిల్లీ: వైద్య కోర్సుల్లో ప్రవేశానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష (నీట్)ను రద్దు చేస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై కేంద్ర ప్రభుత్వం రివ్యూ పిటిషన్ దాఖలు చేసే యోచనలో ఉంది. కోర్టు ఆదేశాల నేపథ్యంలో ఎలాంటి తదుపరి చర్య చేపట్టవచ్చనే అంశంపై న్యాయ నిపుణుల అభిప్రాయం కోరినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ అధికారవర్గాలు శుక్రవారం నాడిక్కడ వెల్లడించాయి.

ఈ విషయంలో న్యాయ సహాయం కోరడమే ప్రభుత్వానికి అందుబాటులో ఉన్న ప్రత్యామ్నాయమని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి గులాం నబీ ఆజాద్ చెప్పారు. సుప్రీం తీర్పు వైద్య కోర్సుల్లో చేరాలనుకుంటున్న విద్యార్థులకు కష్టాలు తెచ్చిపెడుతుందని అన్నారు. తీర్పుపై న్యాయనిపుణుల అభిప్రాయం కోరినట్లు తెలిపారు. కోర్టు తీర్పుతో తాము తీవ్ర నిరాశకు గురయ్యామన్నారు. మంచి ఫలితాలు సాధిద్దామనుకుంటే దురదృష్టవశాత్తూ అలా జరగలేదని వ్యాఖ్యానించారు. అనేక విషయాలను సరిదిద్దాలనుకున్న తమను కోర్టు తీర్పు నీరుగార్చిందన్నారు. ఎంసీఐని పరీక్ష నిర్వహించొద్దన్న కోర్టు ఎవరు నిర్వహించాలో చెప్పలేదన్నారు. ఎవరు పరీక్షలు నిర్వహించాలో చెప్పి ఉంటే బావుండేదన్నారు. దేశవ్యాప్తంగా విద్యార్థులు ఇప్పుడు అటూ ఇటూ తిరగాల్సి వస్తుందని చెప్పారు. వివిధ పరీక్షలకు హాజరైనా సీటు దొరుకుతుందనే నమ్మకం లేదన్నారు. ఒకే సమయంలో వివిధ ప్రవేశ పరీక్షలు జరుగుతున్నందున విద్యార్థులకు పరిమితమైన అవకాశాలే ఉంటాయని తెలిపారు.

నేడు నీట్ తొలివిడత ఫలితాలు!
నీట్ రద్దు కావడంతో రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రైవేటు వైద్య కళాశాలలు సొంతంగా ప్రవేశ పరీక్షలు నిర్వహించుకునేందుకు మార్గం సుగమమైంది. దీంతో విద్యార్థులు కూడా పలురకాల వైద్య విద్యా సంస్థల్లో ప్రవేశానికి వేర్వేరుగా పరీక్షలు రాయాల్సిన అవసరం ఏర్పడింది. భారతీయ వైద్య మండలి తరఫున సీబీఎస్‌ఈ ఈ ఏడాది ఇప్పటికే నిర్వహించిన నీట్ పరీక్షను 7 లక్షల మందికి పైగా విద్యార్థులు రాశారు. ఎంబీబీఎస్‌లో ప్రవేశానికి ఆన్‌లైన్ కౌన్సెలింగ్ ప్రక్రియ ఇప్పటికే మొదలయ్యింది. అఖిల భారత కోటా కింద మొదటి విడత ఫలితాలు శనివారం విడుదల కానున్నాయి.

రాష్ట్ర కోటాలకు సంబంధించిన కౌన్సెలింగ్ ప్రక్రియ ఆగస్టు 2 నాటికి పూర్తి కావాల్సి ఉంది. ఎంబీబీఎస్, బీడీఎస్, పీజీ వైద్య కోర్సుల్లో ప్రవేశానికి నీట్ నిర్వహణ ఏర్పాట్లను ఆరోగ్య శాఖ 2009లోనే ప్రారంభించింది. ఒకే భాషలో ప్రవేశ పరీక్ష నిర్వహించ పూనుకోవడంపై పలు రాష్ట్ర ప్రభుత్వాలు అభ్యంతరం వ్యక్తం చే యడంతో నీట్ వివాదాల్లో చిక్కుకుంది. పలు ప్రాంతీయ భాషల్లో ఉమ్మడి పరీక్షను నిర్వహించాలని విజ్ఞప్తి చేశాయి. ఈ విషయంలో సంసిద్ధతకు మరింత సమయం కోరుతూ ప్రైవేటు వర్సిటీలు, కళాశాలలు కొన్ని కూడా నీట్‌ను వ్యతిరేకించాయి. అనంతరం అవి ఎంసీఐ నోటిఫికేషన్‌ను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించాయి.

మరిన్ని వార్తలు