చైనా ప్ర‌క‌ట‌న‌పై కేంద్రం స్పందించాలి

20 Jun, 2020 14:29 IST|Sakshi
ప్రియాంక చ‌తుర్వేది

ముంబై: ల‌ద్ధాఖ్‌లోని గాల్వ‌న్ లోయ ప్రాంతంపై స‌ర్వ అధికారాలు త‌మ‌కే చెందుతాయ‌న్న చైనా ప్ర‌క‌ట‌న‌పై కేంద్రం స్పందించాల‌ని శివ‌సేన ఉపాధ్య‌క్షురాలు, ఎంపీ ప్రియాంక చ‌తుర్వేది డిమాండ్ చేశారు. స‌రిహ‌ద్దుల్లో శాంతి నెల‌కొనేలా చ‌ర్య‌ల‌కు సిద్ధ‌మంటూనే చైనా ప‌దేపదే రెచ్చ‌గొట్టే వ్యాఖ్య‌లు చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ‘మ‌న భూభాగంలోకి ఎవ‌రూ రాలేద‌ని మోదీ దేశానికి హామీ ఇచ్చారు. కానీ గాల్వ‌న్ లోయ‌ త‌మ‌దిగా చైనా చెప్పుకుంటోంది. ఇది ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదు. దీనిపై ప్ర‌భుత్వం స్పందించాల్సిన అవ‌స‌రం ఉంది. మాకు కొన్ని అనుమానాలున్నాయి. గాల్వ‌న్‌ లోయను మనం విడిచిపెట్టామా లేదా అక్కడి నుంచి చైనా సైన్యాన్ని వెళ్లగొట్టారా?  దేశ ప్ర‌జ‌లంద‌రూ తెలుసుకోవాల‌నుకుంటున్నారు’ అంటూ చ‌తుర్వేది ట్వీట్ చేశారు.
(మరి మన జవాన్లు ఎక్కడ గాయపడ్డారు: చిదంబరం)


జూన్ 15న ల‌ద్ధాఖ్‌లో గాల్వ‌న్ లోయ‌లో స‌రిహ‌ద్దు వివాదంలో త‌లెత్తిన ఘ‌ర్ష‌ణ‌లో భార‌త్‌కు చెందిన క‌ల్న‌ల్ స‌హా 20 మంది సైనికులు వీర‌మ‌ర‌ణం పొందిన సంగ‌తి తెలిసిందే. తీవ్ర ఉద్రిక్త ప‌రిస్థితుల నేప‌థ్యంలో.. వాస్త‌వాధీన రేఖ (ఎల్ఓసీ)కు అటు (చైనా) వైపే కార్య‌క‌లాపాలు కొన‌సాగించుకోవాల‌ని శుక్ర‌వారం చైనాకు భార‌త్ స్ప‌ష్టం చేసింది. మ‌న భూభాగంలోకి ఎవ‌రూ రాలేద‌ని, స‌రిహ‌ద్దు క్షేమ‌మ‌ని, మ‌న ఆర్మీ పోస్టుల‌ను ఎవ‌రూ స్వాధీనం చేసుకోలేద‌ని ప్ర‌ధాన‌మంత్రి  స్ప‌ష్టం చేశారు.  ఒక్క అడుగు కూడా మ‌న భూభాగాన్ని వ‌దులుకునేది లేద‌ని శుక్ర‌వారం జ‌రిగిన అఖిలప‌క్ష స‌మావేశంలో వివిధ పార్టీ నేత‌ల‌తో మోదీ అన్నారు. (రాహుల్‌-అమిత్‌ షా మధ్య ట్విటర్‌ వార్‌ )

మరిన్ని వార్తలు