గోదావరి–కావేరీ నదుల అనుసంధానం

24 Nov, 2017 02:09 IST|Sakshi

ప్రణాళిక రూపకల్పనకు రాష్ట్రాల సీఎంలతో సమావేశం

చెన్నై–బెంగళూరు మధ్య రూ.20వేల కోట్ల ఎక్స్‌ప్రెస్‌ వే: గడ్కారీ

చెన్నై: నదుల అనుసంధానంపై కేంద్ర ప్రభుత్వం పూర్తి చిత్తశుద్ధితో ఉందని, గోదావరి మిగులు జలాల్ని కావేరీకి తరలించేందుకు ప్రణాళిక రూపకల్పన కోసం ముఖ్యమంత్రుల సమావేశం నిర్వహిస్తామని కేంద్ర జల వనరుల శాఖ మంత్రి నితిన్‌ గడ్కారీ చెప్పారు. గోదావరి–కావేరీ నదుల అనుసంధానానికి జల వనరుల శాఖ కృషి చేస్తోందని, ఇది కార్యరూపం దాల్చితే దక్షిణాది రాష్ట్రాల్లో నీటి కొరత తీరుతుందని పేర్కొన్నారు. ‘మిగులు జలాల్ని గోదావరి నది నుంచి కృష్ణకు, అక్కడి నుంచి పెన్నా.. చివరకు కావేరీకి తరలించాలని జల వనరుల శాఖ నిర్ణయించింది’ అని చెన్నైలో గడ్కారీ వెల్లడించారు.

ఈ ప్రాజెక్టుల విషయంలో రాష్ట్రాల ఆందోళనలపై చర్చిస్తున్నామని, సమీప భవిష్యత్తులో నిర్ధిష్ట కార్యాచరణ ప్రణాళికతో ముందుకు వస్తామని ఆయన చెప్పారు. ‘తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సమావేశం నిర్వహించి, వారి అనుమతితో ప్రణాళికను ఖరారు చేస్తాం. ఈ ప్రాజెక్టుల్ని జాతీయ ప్రాజెక్టులుగా పరిగణిస్తాం. 90 శాతం ఖర్చు కేంద్ర ప్రభుత్వం, 10 శాతం రాష్ట్ర ప్రభుత్వాలు భరిస్తాయి’ అని తెలిపారు.  

మొదటి ప్రాజెక్టులో భాగంగా 300 టీఎంసీల గోదావరి నీటిని పోలవరం ప్రాజెక్టు నుంచి నాగార్జున సాగర్‌ డ్యాం ద్వారా కృష్ణాకు మళ్లిస్తారు. అక్కడి నుంచి పెన్నా నదిపై ఉన్న సోమశిల ప్రాజెక్టుకు.. అనంతరం కావేరీ నది పరివాహకంలోని గ్రాండ్‌ ఆనకట్టుకు మళ్లిస్తారు. కాల్వల ద్వారా కాకుండా స్టీలు పైపుల ద్వారా నీటిని తరలిస్తాయని గడ్కారీ వెల్లడించారు. మొదటి దశలో 100 టీఎంసీల నీరు కావేరీకి వెళ్తుందని, ఈ ప్రాజెక్టు ద్వారా తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు లబ్ధిపొందుతాయని తెలిపారు. రెండో ప్రాజెక్టులో భాగంగా ఇంద్రావతి నది నుంచి నీటిని నాగార్జున సాగర్‌ డ్యాంకు తరలిస్తాం.

అక్కడి నుంచి సోమశిల ప్రాజెక్టుకు మళ్లించి అనంతరం కర్ణాటకతో సంబంధం లేకుండా కావేరీకి నీటిని తరలిస్తాం’ అని గడ్కారీ వెల్లడించారు. అలాగే చెన్నై – బెంగళూరుల మధ్య రూ. 20 వేల కోట్లతో ఎక్స్‌ప్రెస్‌ వేను నిర్మిస్తామని చెప్పారు. తమిళనాడులోని తాంబరం–చెంగల్‌పట్టు మధ్య రూ. 2,250 కోట్లు, పూనామలీ నుంచి మదురవొయల్‌ మధ్య రూ. 1500 కోట్లతో, చెన్నై–  ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు మధ్య రూ. 1000 కోట్లతో ఎలివేటెడ్‌ కారిడార్స్‌ నిర్మాణ ప్రతిపాదనలు ఉన్నాయని తెలిపారు.  

మరిన్ని వార్తలు