నిర్భయ దోషికి క్షమాభిక్ష వద్దు!

7 Dec, 2019 04:22 IST|Sakshi

న్యూఢిల్లీ: నిర్భయ హత్యాచార దోషుల్లో ఒకరైన వినయ్‌ శర్మ  పెట్టుకున్న క్షమాభిక్ష పిటిషన్‌ను తిరస్కరించాలని రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌కు శుక్రవారం కేంద్ర హోంశాఖ సిఫారసు చేసింది. ఈ మేరకు ఢిల్లీ ప్రభుత్వ సిఫారసును రాష్ట్రపతికి పంపించింది. దిశ హత్యాచార నిందితులను హైదరాబాద్‌ పోలీసులు ఎన్‌కౌంటర్‌ చేసిన రోజే ఈ సిఫారసు చోటు చేసుకుంది. మరోవైపు, క్షమాభిక్ష వినతిని తోసిపుచ్చాలని నిర్భయ తల్లి కూడా రాష్ట్రపతిని కోరింది. 2012 డిసెంబర్‌లో నిర్భయను ముకేశ్, పవన్, వినయ్, అక్షయ్‌లు పాశవికంగా అత్యాచారం చేసిన విషయం తెలిసిందే.

ఆ తరువాత ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. అనంతరం ఆ నలుగురికి కోర్టు మరణశిక్ష విధించింది. వారిలో వినయ్‌ శర్మ క్షమాభిక్ష పిటిషన్‌ రాష్ట్రపతి వద్ద పెండింగ్‌ లో ఉంది. ఏడేళ్లు గడచిపోయినా, తమకు న్యాయం జరగలేదని, అదే అవేదనను ఇంకా అనుభవిస్తూనే ఉన్నామని రాష్ట్రపతికి రాసిన లేఖలో నిర్భయ తల్లి వివరించారు. తమలా కాకుండా, దిశ తల్లిదండ్రులకు సత్వరమే న్యాయం లభించిందని ఆ లేఖలో ప్రస్తావించారు.  

మరిన్ని వార్తలు