త్వరలో జీఎస్టీ బకాయిల చెల్లింపు

3 Feb, 2020 14:38 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : వివిధ రాష్ట్రాలకు బకాయిపడిన జీఎస్టీ పరిహారాన్ని రెండు విడతల్లో పూర్తిగా చెల్లిస్తామని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. తమ రాష్ట్రాలకు జీఎస్టీ వాటా, ఐజీఎస్టీ కింద చెల్లించాల్సిన పరిహారాలు ఇంతవరకూ రాలేదని పలువురు ఎంపీలు సోమవారం లోక్‌సభ ప్రశ్నోత్తరాల సమయంలో ప్రభుత్వం దృష్టికి తీసుకురాగా కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ ఈ వివరణ ఇచ్చారు. అన్ని రాష్ట్రాలకు చెల్లించాల్సిన జీఎస్టీ పరిహారాన్ని రెండు విడతలుగా చెల్లిస్తామని ఆయన బదులిచ్చారు. జులై 1, 2017 నుంచి జీఎస్టీ అమలుకాగా ఇప్పటివరకూ జీఎస్టీ పరిహారం కింద రాష్ట్రాలకు రూ 2,10,969 కోట్లు విడుదల చేశామని, గత ఏడాది అక్టోబర్‌-నవంబర్‌కు సంబంధించిన జీఎస్టీ చెల్లింపులు బకాయి పడ్డాయని చెప్పారు. రెండు నెలలకు కలిపి ఒకసారి జీఎస్టీ చెల్లింపులు చేపడుతున్నామని, 2019 సెప్టెంబర్‌ వరకూ బకాయిల చెల్లింపులను ఇప్పటివరకూ క్లియర్‌ చేశామని అన్నారు. జీఎస్టీ అమలు సందర్భంగా నూతన పన్ను వ్యవస్థ వల్ల రాష్ట్రాలకు వాటిల్లే పన్ను నష్టాన్ని కేంద్ర ప్రభుత్వం భర్తీ చేస్తున్న సంగతి తెలిసిందే.

చదవండి : ఏప్రిల్‌ 1 నుంచి మరింత ఈజీగా జీఎస్టీ..

మరిన్ని వార్తలు