కేరళకు రూ. 600 కోట్ల వరద సాయం

21 Aug, 2018 19:42 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : వరదలతో తల్లడిల్లిన కేరళకు కేంద్ర ప్రభుత్వం రూ. 600 కోట్లు విడుదల చేసింది. కేరళ వరదలను తీవ్ర ప్రకృతి విపత్తుగా ప్రకటించిన కేంద్రం ఆ దిశగా వరద సాయం కింద ఈ నిధులను విడుదల చేసింది. కేరళకు అదనంగా బియ్యం, పప్పు ధాన్యాలు సరఫరా చేయాలని కేంద్రం నిర్ణయించింది. ఆ రాష్ట్రానికి తరలించే వరద సహాయ సామాగ్రి, ఆహార పదార్ధాలపై జీఎస్టీ మినహాయింపును ప్రకటించింది.

భారీ వర్షాలు తగ్గుముఖం పట్టిన క్రమంలో విద్యుత్‌, టెలికాం సేవల పునరుద్ధరణపై కేంద్రం ప్రధానంగా దృష్టిసారించింది. రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో తక్షణమే మౌలిక సేవల పునరుద్ధరణకు చర్యలు చేపట్టింది. ఎల్పీజీ సిలిండర్ల పంపిణీకి ప్రత్యేక కేంద్రాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. క్యాబినెట్‌ కార్యదర్శి నేతృత్వంలో జాతీయ సంక్షోభ నిర్వహణ కమిటీ సమావేశంలో కేంద్రం ఈ నిర్ణయాలు తీసుకుంది. కాగా వరద బీభత్సంతో భీతిల్లిన కేరళను అన్నివిధాలా ఆదుకుంటామని ప్రధాని నరేంద్ర మోదీ ఇప్పటికే ప్రకటించగా, పలు రాష్ట్రాల సీఎంలు, నేతలు, సినీ నటులు, పారిశ్రామిక వేత్తలు భారీ విరాళాలతో ముందుకొచ్చిన సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు